logo

కాబోయే అమ్మలకు కంటికి రెప్పలా!

గర్భం దాల్చిన మొదటి నెల నుంచి ప్రసవం వరకు గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రణాళికకు రూపకల్పన చేసింది. నగరంలో 85 పట్టణ ఆరోగ్య

Updated : 23 May 2022 02:36 IST

సాధారణ ప్రసవ కోసం కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: గర్భం దాల్చిన మొదటి నెల నుంచి ప్రసవం వరకు గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రణాళికకు రూపకల్పన చేసింది. నగరంలో 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 150 వరకు బస్తీ దవాఖానాలు ఉన్నాయి. వీటి పరిధిలో నెలకు 6,500 మంది గర్భిణీలు సేవలు పొందుతుంటారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రసవాల్లో ఎక్కువ సిజేరియన్లు ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సాధారణ ప్రసవాలకు ప్రయత్నం చేయకుండానే సీజేరియన్లు వైపు మొగ్గుచూపుతున్నారని ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి వచ్చింది. వీటిని నివారించడంతోపాటు గర్భిణుల ఆరోగ్యం కాపాడటం...పుట్టే శిశువుకు అన్ని రకాల టీకాలు ఇతర వైద్య సేవలు అందేలా చూడటం కోసం ప్రణాళికను అందుబాటులోకి తెచ్చింది.

ఇలా చేస్తున్నారు...

* ఆసుపత్రుల్లో పేరు నమోదు చేసుకున్న గర్భిణిల ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి సారిస్తారు. ప్రస్తుతం ప్రతి సోమ, శుక్రవారం పరీక్షలు చేస్తున్నారు. ఇకపై సోమ, మంగళ, గురు, శుక్రవారం నాలుగు రోజులు కేటాయిస్తారు.

* గర్భిణులకు మధుమేహం, అధిక రక్తపోటు ప్రధాన శత్రువులు. పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ప్రసవం కష్టమవుతోంది. పుట్టబోయే శిశువుల్లో లోపాలు కన్పిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు.

* కొన్ని ప్రధాన ప్రసూతి ఆసుపత్రుల వైద్యులతో ఆరోగ్య సిబ్బందికి రోజూ జూమ్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గర్బిణులు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు.

* సమీప ఆసుపత్రులకు వెళ్లి వివిధ పరీక్షలు చేయించుకునేలా సమాయత్తం చేస్తున్నారు. తెలంగాణ డయోగ్నొస్టిక్‌ కేంద్రాల్లో పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు.

* సాధారణ ప్రసవం కోసం కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. ఒకటో నెల నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. బిడ్డకు వేయాల్సిన టీకాలపై అవగాహన కల్పిస్తున్నారు. పుట్టిన గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టాలని సూచిస్తున్నారు.

ప్రత్యేక జాగ్రత్తలు అవసరం...

-డాక్టర్‌ వెంకటి, డీహెచ్‌ఎంవో, హైదరాబాద్‌

సిజేరియన్లకు అడ్డుకట్ట వేసి సాధారణ ప్రసవాలు పెంచాలనే ఉద్దేశంతో గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వైద్యుల నుంచి ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు దీనిపై సూచనలిచ్చాం. గర్భిణుల్లో వచ్చే సాధారణ అనారోగ్య సమస్యలపై రోజుకొక నిపుణుడితో సిబ్బందికి జూం సమావేశాలు నిర్వహిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని