logo
Published : 23 May 2022 02:32 IST

ఖర్చుకు వెనుకాడకుండా దవాఖానాల ఆధునికీకరణ

తొలిసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు

వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

క్యాథ్‌ల్యాబ్‌ను ప్రారంభించి పరిశీలిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, తలసాని తదితరులు

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలోకంటే రెండింతల నిధులు రూ.11,440 కోట్లు కేటాయించారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో ఏకంగా రూ.2679కోట్లతో నాలుగు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు కాబోతున్నాయని చెప్పారు. ఆదివారం గాంధీఆసుపత్రిలో రూ.13కోట్లతో ఏర్పాటుచేసిన అత్యాధునిక ఎమ్మారై స్కానింగ్‌ యంత్రం, రూ.9కోట్లతో సమకూర్చిన క్యాథ్‌ల్యాబ్‌లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, డీఎంఈ రమేష్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావులతో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. రూ.2.70కోట్లతో నిర్మించనున్న అధునాతన డైట్‌ క్యాంటీన్‌ కిచెన్‌కు శంకుస్థాపన చేశారు.

అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఖర్చులకు వెనకాడకుండా ఆసుపత్రుల ఆధునికీకరణ, వైద్యపరికరాలు సమకూర్చడంవల్ల ఖరీదైన వైద్యసేవలు పేదలకు అందేలా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలు (ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌) త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు. రూ.7.50కోట్లతో గాంధీఆసుపత్రి, పేట్లబురుజు, వరంగల్‌ ఆసుపత్రులలో వీటిని ఏర్పాటుచేస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా, నిజామాబాద్‌, వేములవాడ, సిద్దిపేటలో మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లను ప్రారంభించామన్నారు. గాంధీలో 48 మోకీలు ఆపరేషన్లు జరగగా, ఉస్మానియాలో ఆరు నెలల్లో 50పైగా జరిగాయన్నారు.

పేదలకు ఉపయుక్తం

గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించిన క్యాథ్‌ల్యాబ్‌ పేదరోగులకు ఎంతగానో ఉపయోగపడనుందని తెలిపారు. గాంధీలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయనీ, రూ.100కోట్లతో అధునాతన వైద్యపరికరాలు, సదుపాయాలు సమకూర్చుతున్నామని తెలిపారు. ఆసుపత్రిలో రూ.30కోట్లతో స్టేట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

కార్పొరేటుకు దీటుగా...ఉస్మానియాలో ప్రారంభించిన క్యాథ్‌ల్యాబ్‌వల్ల 250మందికి గుండె సంబంధ రోగులకు యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్‌ చికిత్సలు అందించామన్నారు. ఇప్పటికే వరంగల్‌ ఎంజీఎం, ఖమ్మం, అదిలాబాద్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, చెస్ట్‌, ఎంజీఎం, ఈఎన్‌టీ, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ తదితర ఆసుపత్రులకు 21 సీటీస్కానింగ్‌ యంత్రాలను పంపిణీ చేశామన్నారు. ఇలాంటి సదుపాయాలు ఇదివరకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనే ఉండేవని, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా అందుతున్నాయన్నారు.

రూ.20 కోట్లతో పరికరాల నిర్వహణ పాలసీ

అత్యాధునిక యంత్రాలు, పరికరాల నిర్వహణ, మరమ్మతులకు దారితీస్తే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సీఎం కేసీఆర్‌ ఆలోచనమేరకు ప్రభుత్వం రూ.20కోట్లతో తొలిసారి బయోమెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటనెన్స్‌ పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్యపరికరాలు ఎల్లప్పుడూ క్రియాశీలకంగా ఉండనున్నాయన్నారు. హైదరాబాద్‌లో 259 బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేశామని, మరో 91 ప్రాంతాల్లో రానున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన టీ డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో 57 రకాల పరీక్షలు చేస్తుండగా, వాటి సంఖ్య 134కు పెంచబోతున్నాని తెలిపారు. ఆసుపత్రుల్లో రోగుల సహాయకుల కోసం 18 ప్రాంతాల్లో రూ.5కే భోజనం అందిస్తున్నామని, వారికి షెల్టర్‌ హోమ్స్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని