logo
Updated : 25 Jun 2022 04:26 IST

ఆనందం వెంట ఆరోగ్యం..!

ఈనాడు, హైదరాబాద్‌

ప్రభుత్వ ఇంజినీర్‌ శివరాజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరే  ఇంటి నుంచి బయలుదేరి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం ఇంటి నుంచి ఫోన్‌. అమ్మకు కళ్లు తిరిగినట్లు అవుతున్నాయని చెప్పగానే ఒకటే కంగారు. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండటంతో నిర్లక్ష్యం చేయవద్దని వెంటనే ఇంటి నుంచి క్యాబ్‌ బుక్‌ చేసి ఆసుపత్రికి రమ్మని భార్యకు పురమాయించారు. తానూ కారులో ఆసుపత్రికి బయలుదేరారు. పరీక్షించిన డాక్టర్‌ అంతా బాగానే ఉందని ఆందోళన అక్కర్లదేని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ రెండు మూడు గంటల పాటు మాత్రం చాలా ఆందోళనకు గురయ్యారు.

అదే గేటెడ్‌ కమ్యూనిటీలోనే ఆసుపత్రి ఉంటే.. నలభై నుంచి వంద పడకలది ఉంటే.. ఫ్యామిలీ డాక్టర్‌ ఎల్లవేళలా అందుబాటులో ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరవచ్చు. అత్యవసరమైతే డాక్టరే ఇంటికి వస్తారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు తాము నిర్మిస్తున్న గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాంగణాల్లో ఆసుపత్రులను సైతం ఏర్పాటు చేయబోతున్నాయి. ప్రస్తుతం వీటిల్లో వారాంతపు క్లినిక్‌లు, నర్సింగ్‌ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటికి కొనసాగింపుగా పూర్తి స్థాయిలో నడిచే వైద్యశాలల ఏర్పాటుకు కార్పొరేట్‌ ఆసుపత్రులతో చర్చిస్తున్నారు. దీనిని ఏర్పాటు చేయడానికి కావాల్సిన భవనాన్ని నిర్మించి లీజుకు ఇస్తారు. కమ్యూనిటీ వాసుల్లో ప్రధానంగా చిన్నపిల్లలు, మహిళలు, పెద్దలు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు.. ప్రత్యేకించి వీరికి ఫ్యామిలీ డాక్టర్‌ అందుబాటులో ఉండేలా ఆసుపత్రులు పనిచేయనున్నాయి. కేవలం ఒక్క కమ్యూనిటీకే కాకుండా చుట్టుపక్కల సైతం వైద్యసేవలు అందించేందుకు వీలుగా ఉంటుంటి కాబట్టి ఆసుపత్రి నిర్వహణ లాభసాటిగానే ఉంటుందని చెబుతున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు సైతం బిల్డర్లు సిద్ధమంటున్నారు. కొండాపూర్‌లో ఒకటి, తెల్లాపూర్‌లో మరొకటి ఆకాశహర్మ్యాల చెంత ఆసుపత్రులు రాబోతున్నాయి.

అన్నీ లోపలే...  
* సౌకర్యాల కల్పనతో నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. కొంగొత్త సదుపాయాలను కల్పిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో కమ్యూనిటీల్లో వెయ్యి నుంచి నాలుగువేల కుటుంబాలు నివసించేలా నిర్మాణాలు చేపడుతున్నారు. వీరి అవసరాలన్నీ గేటు లోపలే అందేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది మాల్స్‌లో గడుపుతున్నారు. వీటిని సైతం కమ్యూనిటీల చెంతనే కడుతున్నారు. నడుచుకుంటూ షికారుకెళ్లొచ్చు. షాపింగ్‌ పూర్తి చేయవచ్చు.
* సినిమా ప్రదర్శనల కోసం మినీ థియేటర్లు వస్తున్నాయి. ఇందులోనే తమకు నచ్చిన సినిమాలను, కుటుంబ వీడియోలను అందరూ కలిసి వీక్షించవచ్చు. భవిష్యత్తులో వీటిలో కొత్త సినిమాలు సైతం విడుదల చేసే అవకాశం ఉందని బిల్డర్లు అంటున్నారు.
* ఈతరం కుర్రకారు టీవీల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటమే కాదు స్వయంగా ఆడేందుకు ఇష్టపడుతున్నారు. చిన్నారులైతే తమ ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇందుకోసం టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. క్రికెట్‌ కోసం మినీ మైదానాలను నిర్మిస్తున్న బిల్డర్లు ఉన్నారు. కోచ్‌లు సైతం అందుబాటులో ఉంటున్నారు.
* నడక కోసం వాకింగ్‌ ట్రాక్‌లు సర్వసాధారణం. ఇప్పుడు స్కైవాక్‌ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. అక్కడే ఈత కొలనుల వంటి హంగులు కల్పిస్తున్నారు.

బిజినెస్‌ లాంజ్‌లు
ప్రస్తుతం ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇది కొనసాగే అవకాశం ఉంది. అందుకోసం కోవర్కింగ్‌ స్పేస్‌లను రెసిడెన్షియల్‌ కమ్యూనిటీల్లోనే కల్పిస్తున్నారు. ఉద్యోగులు  ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇక్కడికి వచ్చి పనిచేసుకోవచ్చు. అంకుర సంస్థలు సైతం తమ కార్యాలయాలను ఇందులో తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్తగా బిజినెస్‌ లాంజ్‌లను నిర్మాణ సంస్థలు కల్పిస్తున్నాయి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని