logo

‘మెట్రో’ నిర్మాణ కష్టాలకు అక్షరరూపం ‘మేఘపథం’

మెట్రోరైలు నిర్మాణ సమయంలో ఎదురైన సమస్యలను, కష్టాలను, నిష్ఠూరాలను సంకల్ప బలంతో అధిగమించి మేధో మథనంతో ప్రాజెక్టును విజయవంతం చేసి పది కాలాలు చెప్పుకొనేలా చేయడంలో ఎన్వీఎస్‌రెడ్డి కృషి ఎంతో ఉందని పలువురు

Published : 10 Aug 2022 02:45 IST

పుస్తకం ఆవిష్కరిస్తున్న పైడిపాల, ఆచార్య యన్‌.గోపి, పుస్తక రచయిత ఎన్వీఎస్‌ రెడ్డి,

ప్రతిమా, వరప్రసాద్‌రెడ్డి, సుద్దాల అశోక్‌తేజ, జూలూరి గౌరీశంకర్‌

జూబ్లీహిల్స్‌: మెట్రోరైలు నిర్మాణ సమయంలో ఎదురైన సమస్యలను, కష్టాలను, నిష్ఠూరాలను సంకల్ప బలంతో అధిగమించి మేధో మథనంతో ప్రాజెక్టును విజయవంతం చేసి పది కాలాలు చెప్పుకొనేలా చేయడంలో ఎన్వీఎస్‌రెడ్డి కృషి ఎంతో ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆయన ఎదుర్కొన్న కష్టాలకు అక్షరరూపం  ‘మేఘపథం’ అని పేర్కొన్నారు. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి రచించిన 58 దీర్ఘ కవితల సంకలనం ‘మేఘపథం.. మెట్రో కవితా ఝురి’ పుస్తకాన్ని జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్‌.గోపి ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకులు పద్మభూషణ్‌ డా.కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో నిర్మాణంలో కష్టాల్లాగే తామూ ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. సంస్థ ప్రారంభ సమయంలో ప్రభుత్వాల మద్దతు కరవైందని, కనీసం నీరు ఇవ్వకుండా ముఖ్యమంత్రులు ముఖం చాటేశారన్నారు. కేసీఆర్‌ ఒక్కరే నీళ్లిచ్చారని పేర్కొన్నారు. ఈ అనుభవాలతో తాను సైతం పుస్తకం రాస్తే బావుంటుందనిపిస్తుందని చెప్పారు.  విశిష్ట అతిథి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ. భూమార్గంలో నడిచే రైలును ఆకాశమార్గం పట్టించి నడిపించిన కథానాయకుడు ఎన్వీఎస్‌రెడ్డి అని కొనియాడారు. మరో విశిష్ట అతిథి డాక్టర్‌ పైడిపాల మాట్లాడుతూ.. గుండెల్లో రైళ్లు పరిగెత్తడం విన్నాం.. మేఘాల్లో రైళ్లు పరిగెత్తడం చూశామన్నారు. భాగ్యనగరానికి మెట్రో కీర్తితోరణమని, ఎన్వీఎస్‌ మానసపుత్రిక అని పేర్కొన్నారు. ఆచార్య ఎన్‌.గోపి మాట్లాడుతూ.. ఎన్వీఎస్‌ తన కవితా సౌందర్యంతో మంత్రముగ్ధులను చేశారని ప్రశంసించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరి గౌరిశంకర్‌ మాట్లాడుతూ..  12 సంవత్సరాల యజ్ఞం చేసి మెట్రో తీసుకొచ్చారన్నారు. కేసీఆర్‌ 14 ఏళ్లు యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారని పేర్కొన్నారు. పుస్తక రచయిత ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. అప్పట్లో తన తెలుగు పండితులు వేసిన పునాదే ఇప్పుడు ఉపయోగపడిందన్నారు. చార్మినార్‌, ఇతర కట్టడాలు మెట్రో వల్ల తొలగిస్తారనే అపవాదులు సృష్టించారని వాటన్నింటిని తట్టుకొని 2600 పిల్లర్లు వేసి ముందుకుసాగమన్నారు. ఇప్పుడు హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలు ఈ నిర్మాణ విధానాన్ని అధ్యయనం చేసేందుకు ముందుకొస్తున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని