logo
Published : 11 Aug 2022 03:59 IST

జనావాసాలను ముంచెత్తిన విషం

డంపింగ్‌యార్డు మురుగుతో  కాలనీల మునక
ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, జవహర్‌నగర్‌


దమ్మాయిగూడ చెరువు మురుగునీరు పొంగి పొర్లడంతో మునిగిన ఇళ్లు

డంపింగ్‌యార్డు చెత్తకుప్పల్లోంచి వెలువడ్డ గాఢ మురుగు జవహర్‌నగర్‌ చుట్టుపక్కల గ్రామాలు ముంచెత్తింది. కాలకూట విషం లాంటి ‘లెగసీ లీచెట్‌’ వందలాది కాలనీలను నరక కూపంలా మార్చింది. వేలాది మందికి వారం రోజులుగా నిద్ర లేదు.
జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుల్లో లక్షలాది టన్నుల చెత్త పర్వతాల్లా పేరుకుపోయింది. వాటిల్లోంచి మురుగు  నిత్యం వెలువడుతూనే ఉంటుంది. వర్షాలొచ్చినప్పుడు మరింత ఎక్కువ బయటకు వస్తోంది. అదంతా డంపింగ్‌యార్డుకు ఉత్తరం, దక్షిణం వైపున ఉన్న రెండు చెరువుల్లో చేరుతుంది. ఉత్తరాన ఉన్న మల్కారం చెరువుపై తీవ్రత అధికం. అందులోని నీటిని శుద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ వేర్వేరు రూపాల్లో ఇప్పటి వరకు రూ.50కోట్లకుపైగా వెచ్చించింది. కానీ బాధిత గ్రామాల కష్టాల్లో ఏమాత్రం మార్పు రాలేదు. ఫలితం లేకుండా ఎవరికోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారంటూ డంపింగ్‌యార్డు బాధితుల ఐకాస నేత పద్మాచారి ‘ఈనాడు’తో వాపోయారు.  ఇటీవలి వర్షాలకు దమ్మాయిగూడలో 80కాలనీలు, జవహర్‌నగర్‌లో 60కాలనీలకుపైగా గాఢ మురుగులో మునిగాయన్నారు. ఇప్పటికీ మురుగు కాలనీల్లోనే ఉందని, దాన్నుంచి వెలువడే వాసన పీల్చలేక, కలుషిత తాగునీటిని ఉపయోగించలేక నిత్యం నరకం చూస్తున్నామన్నారు. నీటి నుంచి పొగలాంటి వాసన వస్తోందని, ప్రాణభయం తలెత్తుతోందని అన్నారు. ఎంఎల్‌ఆర్‌ కాలనీ, అంజనాద్రి ఎన్‌క్లేవ్‌, పీఎన్‌ఆర్‌ కాలనీ, శ్రీసాయి ఎన్‌క్లేవ్‌, హరిప్రియ కాలనీ, ఆర్‌సీ ఎన్‌క్లేవ్‌, తదితర ప్రాంతాల్లో తాగునీటి పైపులైన్లు కలుషితం అయ్యాయని, జవహర్‌నగర్‌ వరదతో దిగువనున్న దమ్మాయిగూడలోని వ?డు చెరువులు, నాగారంలోని రెండు చెరువులు, చీర్యాలలోని రెండు చెరువులు, ఓ బండ్ల తటాకం, ఘట్‌కేసర్‌, ఎదులాబాద్‌లోని తటాకాలు కాలుష్యంలో చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్లక్ష్యంగా రూ.251 కోట్ల ప్రాజెక్టు
ఐదేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ మల్కారం చెరువు వద్ద శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆర్వో యంత్రాలతో 60 శాతం నీటిని స్వచ్ఛంగా మార్చగా, 40 శాతం నీరు వ్యర్థ జలంగా తిరిగి చెరువులోకి చేరిందని అధికారులు చెబుతున్నారు. కొన్నాళ్లకు డంపింగ్‌యార్డు నుంచి వచ్చే మురుగుతో చెరువు మళ్లీ నిండిందని, పరిమాణం 756 మిలియన్‌ లీటర్లకు చేరింది.  చెరువును ఐదేళ్లలో రూ.251 కోట్లతో పరిశుభ్రంగా మార్చేందుకు అంతర్జాతీయ టెండర్లు పిలిచింది.  ఏడాదిన్నరైనా నీటి శుద్ధి మొదలు కాలేదు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని