logo

బడికెళ్లనంటూ బతుకే చాలించింది

భర్త దూరమైనా ముగ్గురు బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయాలనేది ఆ అమ్మ తాపత్రయం. ఇంటింటా.. పనులు చేస్తూ బిడ్డలను చదివించుకుంటోంది. పిల్లలను చూసుకుంటూ కష్టాలను మరచిపోతుంది. బడికెళ్లటం ఇష్టం లేదంటూ

Published : 12 Aug 2022 03:56 IST
ఉరివేసుకుని తొమ్మిదేళ్ల బాలిక బలవన్మరణం

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: భర్త దూరమైనా ముగ్గురు బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయాలనేది ఆ అమ్మ తాపత్రయం. ఇంటింటా.. పనులు చేస్తూ బిడ్డలను చదివించుకుంటోంది. పిల్లలను చూసుకుంటూ కష్టాలను మరచిపోతుంది. బడికెళ్లటం ఇష్టం లేదంటూ మారాం చేసిన రెండో కుమార్తె(9) బలవన్మరణానికి పాల్పడడంతో ఆ తల్లి.. బిడ్డ జ్ఞాపకాలను తలచుకొని కుమిలికుమిలి ఏడుస్తోంది. నల్లగుట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త రెండేళ్ల క్రితం గుండెపోటుతో మరణించాడు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడి(3)తో కలిసి టకారాబస్తీలో ఖాళీగా ఉన్న తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. పెద్దకుమార్తె 9వ తరగతి, 2వ కుమార్తె 5వ తరగతి చదువుతుంది. 15 రోజులుగా పాఠశాలకు వెళ్లనంటూ చిన్న కుమార్తె మారాం చేస్తూ వచ్చింది. కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చే సంవత్సరం ఇష్టమైన పాఠశాలకు పంపుతామంటూ నచ్చచెప్పారు. అయినా పాప ప్రవర్తనలో మార్పురాలేదు. ఇంట్లోనే తమ్ముడికి తోడుగా ఉంటానంటూ చెబుతూ వచ్చింది. కూతుర్ని కష్టపెట్టడం ఇష్టంలేక ఇంట్లోనే ఉండేందుకు తల్లి అంగీకరించింది. ఉదయం తాను పనికి వెళ్లేటపుడు కొడుకు, కూతుర్ని ఇంట్లోనే ఉంచి బయట తాళం వేసుకొని వెళ్లి వస్తుండేది. గురువారం ఉదయం సైతం పిల్లల్ని ఇంట్లో ఉంచి తాళంవేసి వెళ్లిపోయింది. మధ్యాహ్నం సమయంలో కుమారుడు గట్టిగా ఏడుస్తుండటం చుట్టుపక్కలవారు గమనించారు. కిటికీలో నుంచి చూడగా బాలిక ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్థానికులు వెంటనే మార్కెట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి తాళం పగలగొట్టి లోపలకు వెళ్లారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న బాలికను కిందకు దించారు. అప్పటికే మృతిచెందినట్టు గుర్తించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలిక ఆత్మహత్యకు బలమైన కారణాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుని విచారణ చేపడుతున్నామని ఎస్సై కనకయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని