logo

బైక్‌ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

ఐటీఐ చదివిన ఓ వ్యక్తి జల్సాలకు అలవాటు పడి వాహనాల దొంగతనాలు చేస్తూ చివరకు కటకటాలపాలయ్యాడు. కేపీహెచ్‌బీ ఠాణా సీఐ కిషన్‌కుమార్‌ కథనం ప్రకారం..

Published : 17 Aug 2022 02:38 IST

ఆల్విన్‌కాలనీ,(కేపీహెచ్‌బీ) న్యూస్‌టుడే: ఐటీఐ చదివిన ఓ వ్యక్తి జల్సాలకు అలవాటు పడి వాహనాల దొంగతనాలు చేస్తూ చివరకు కటకటాలపాలయ్యాడు. కేపీహెచ్‌బీ ఠాణా సీఐ కిషన్‌కుమార్‌ కథనం ప్రకారం.. బాలాపూర్‌ జనప్రియ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే దస్తర్బంద్‌ షఫీ(39) ఐటీఐ చదివాడు. జల్సాలకు అలవాటు పడి అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే కృష్ణ యోగేశ్వర్‌ (19)తో కలిసి ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నాడు. పలు ఠాణాల పరిధుల్లో 15 వాహనాలను చోరీ చేశాడు. మూడు రోజుల క్రితం కేపీహెచ్‌బీ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్‌లో ద్విచక్ర వాహనం కనిపించడం లేదని ఫిర్యాదు అందింది. మాదాపూర్‌ సీసీఎస్‌, కేపీహెచ్‌బీ పోలీసులు గాలిస్తుండగా నిజాంపేట్‌ కూడలిలో షఫీ, యోగేశ్వర్‌ అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. విచారించగా వాహనాల చోరీల విషయం బహిర్గతమైంది. 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


మహిళ నుంచి బంగారు ఆభరణాల దోపిడీ

గుడివాడ గ్రామీణం: నగరానికి చెందిన గొట్టుముక్కల రాధాకృష్ణ, రామ వాణిశ్రీ దంపతులు విశాఖ వెళ్లడానికి సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లో లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్‌ దాటి మోటూరు వద్దకు రైలు వస్తూ నిదానం అయ్యింది. వీరిని అనుసరించిన ముఠా సభ్యులు రామ వాణిశ్రీ మెడలో ఉన్న బ్యాగ్‌ను లాక్కొని రైలు దూకి పరారయ్యారు. అందులో 45 గ్రాముల బంగారు సూత్రాల తాడు ఉంది. బాధితులు గుడివాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని