logo

పండగ దోపిడీకి అడ్డుకట్ట

దసరా సెలవులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా ఛార్జీల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు రవాణా శాఖ అడ్డుకట్ట వేయనుంది.

Updated : 24 Sep 2022 06:37 IST


ప్రైవేటు ట్రావెల్స్‌ వాహనాలపై రవాణా శాఖ నజర్‌

ఈనాడు, హైదరాబాద్‌: దసరా సెలవులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా ఛార్జీల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు రవాణా శాఖ అడ్డుకట్ట వేయనుంది. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 4 వరకు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు, కార్లు, మ్యాక్సీ కాబ్‌లను రవాణా శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీ చేయనున్నారు. శనివారం నుంచి ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, ఐఎస్‌సదన్‌, జేబీఎస్‌, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరగనున్నాయి. అక్రమంగా ప్రయాణికులను తరలించే ప్రైవేటు వాహనాలపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ చేసిన విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోదాడ, సిద్దిపేట, షాద్‌నగర్‌లోని చెక్‌పోస్టుల వద్ద రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేపట్టనున్నారు.

కర్నూలు, విజయవాడ మార్గాలే లక్ష్యం..
దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు 18 లక్షల మంది ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లనున్నారన్న అంచనాతో కర్నూలు, విజయవాడ మార్గాలను రవాణా శాఖ అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. సాధారణ రోజుల్లో ప్రైవేటు ట్రావెల్స్‌లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఒక టికెట్‌కు రూ.600-700 ఛార్జీ వసూలు చేస్తుండగా.. దసరా సెలవులు మొదలైన వెంటనే రెట్టింపు చేస్తున్నారు. గతేడాది పండుగ రెండు, మూడు రోజుల ముందైతే ఒక్కో టిక్కెట్‌ రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు వసూలు చేశారు. ఈ సారి అలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారని రుజువైతే.. వెంటనే వాహనాలను స్వాధీనం చేసుకొని, వాటిలోని ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో పంపించనున్నారు.

ఆర్టీసీలో అదనపు ఛార్జీల్లేవ్‌..
ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలన్న లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు పండగ సందర్భంగా అదనపు బస్సులు ఏర్పాటు చేసినా అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు. గతంలో ప్రత్యేక బస్సుల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు. ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులూ అంతే వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు ప్రైవేటులో వెళ్లేందుకు ఆసక్తి చూపేవారు. ఈ సారి రవాణాశాఖ అధికారులు అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదంటూ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని