logo

మైనార్టీ విద్యకు భరోసా

మైనార్టీల విద్య మరింత బలోపేతం కానుంది. తొలిసారిగా తాండూరు మండలంలో విశ్వ విద్యాలయాన్ని తలపించేలా గురుకుల భవనం అందుబాట్లోకి రానుంది.

Published : 05 Dec 2022 04:48 IST

రూ.18కోట్లతో సిద్ధమైన గురుకులం

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ: మైనార్టీల విద్య మరింత బలోపేతం కానుంది. తొలిసారిగా తాండూరు మండలంలో విశ్వ విద్యాలయాన్ని తలపించేలా గురుకుల భవనం అందుబాట్లోకి రానుంది. వందల మంది విద్యార్థుల బోధనతోపాటు వసతి సదుపాయాల్ని సర్కారు ఉచితంగా అందించనుంది. అన్ని హంగులతో ముస్తాబైన గురుకులాన్ని వచ్చే జనవరి మాసంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జిన్‌గుర్తి గేటువద్ద..

ప్రభుత్వం మైనార్టీల విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా తాండూరు మండలానికి మైనార్టీ గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. రూ.18 కోట్ల నిధులు విడుదల చేయడంతో జిన్‌గుర్తి గేటు వద్ద 167వ జాతీయ రహదారిని ఆనుకొని ప్రభుత్వ స్థలంలో గురుకుల పాఠశాల భవన నిర్మాణం చేపట్టారు. టీఎస్‌డబ్ల్యూఐడీసీ శాఖ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలుగా పనుల్ని కొనసాగింపజేశారు. తాజాగా పనులు తుది దశకు చేరాయి. పెద్దపెద్ద భవనాలను నిర్మించగా రంగులు వేసి ముస్తాబు చేశారు. మైదానాన్ని రోలరుతో చదును చేస్తున్నారు.

లిఫ్టు సదుపాయం..

విశాలమైన స్థలంలో నాలుగంతస్తుల్లో భవన సముదాయాల్ని నిర్మించారు. 600 మంది విద్యార్థుల విద్యాభ్యాసానికి, వసతికి, భోజనానికి వేర్వేరుగా సముదాయాల్ని నిర్మించారు. చుట్టూ ప్రహరీ నిర్మాణం సైతం పూర్తయింది. పై అంతస్తుల్లోని భవనాలకు సులభంగా చేరుకునేందుకు వీలుగా లిప్టుల్ని నిర్మించారు. క్రీడలు, ఆటలకు అనుకూలంగా రెండు ఎకరాల్లో మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉండటంతో విద్యార్థుల్ని కలిసేందుకు వచ్చే తల్లిదండ్రులకు సౌకర్యంగా మారనుంది. భవనాన్ని రెండు నెలల్లో ప్రారంభించేందుకు టీఎస్‌డబ్ల్యూఐడీసీ, పాఠశాల విద్యా శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నూతన భవనం అందుబాట్లోకి వస్తే తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాలతోపాటు పట్టణం, కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లోని మైనార్టీ విద్యార్థులకు ఉచిత వసతి సదుపాయాలతో కూడిన విద్య అందించేందుకు దోహదపడనుంది.  


జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు
- నరోత్తం, ఏఈ, టీఎస్‌డబ్ల్యూఐడీసీ, తాండూరు

పాఠశాల భవనం పనులు పూర్తయ్యాయి. మైదానం చదును పనులు కొనసాగుతున్నాయి. నెలాఖరులోగా పూర్తి చేయిస్తాం. వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్ర మంత్రులచేత ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని