logo

‘ఆసరా’.. ఆలస్యం!

పేదలను ఆదుకునేందుకు సర్కారు ‘ఆసరా’కు శ్రీకారం చుట్టింది. పథకంలో భాగంగా ప్రతినెలా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్‌ ఇస్తోంది. అయితే లబ్ధిదారులకు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 05 Dec 2022 04:48 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ

* వికారాబాద్‌ మండలం సిద్దులూర్‌ గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (70) వృద్ధ్యాప పింఛన్‌ పొందుతున్నారు. గతంలో  సజావుగా వచ్చేవని, గత కొన్ని నెలలుగా ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. అనారోగ్య సమస్య ఉందని, మందుల కొనుగోలుకు డబ్బులు ఉపయోగపడేవని, ఈ సారి ఇంకా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


* కోటాలగూడ గ్రామానికి చెందిన శంకరమ్మ దివ్యాంగుల పింఛన్‌ తీసుకుంటున్నారు. ఎటువంటి పనులు చేయలేనని,  పింఛన్‌ డబ్బులే ఆధారమన్నారు. ఆలస్యం కావడంతో అవస్థలు తప్పడంలేదని వాపోయారు.


పేదలను ఆదుకునేందుకు సర్కారు ‘ఆసరా’కు శ్రీకారం చుట్టింది. పథకంలో భాగంగా ప్రతినెలా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్‌ ఇస్తోంది. అయితే లబ్ధిదారులకు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క నెల ఆలస్యమైనా ఇదే ఆధారమైన వారికి అవస్థలు తప్పవు. ఇప్పటివరకు అక్టోబరుకు సంబంధించినవి ఇవ్వలేదు. నవంబరు కూడా ముగిసింది. ఎప్పుడు ఇస్తారోనని ఎదురు చూస్తున్నారు. నిత్యం బ్యాంకులు, ఆయా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఇస్తారోమోనన్న ఆశతో మండల కేంద్రాలకు వచ్చి వెళుతున్నారు.  ప్రతి నెలా మొదటి వారమే ఇవ్వాలని కోరుతున్నారు.

జాప్యం జరుగుతూనే ఉంది

వృద్ధాప్య, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు నెలకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్నారు. జాప్యం నెలకొనడంతో ప్రతి నెలా ఎదురు చూపులు తప్పడంలేదు. అక్టోబరువి నవంబరు 5వ తేదీ లోగా చెల్లించాలి. వాటిని నవంబరు చివరి వారంలో చెల్లిస్తున్నారు. ఈ సారి అక్టోబరువి ఇప్పటి వరకు ఇవ్వలేదు.  నవంబరుకు సంబంధించి ఎప్పుడు వస్తుందో తెలియదు. మండలాల్లో తపాలా సిబ్బంది పంచాయతీల వద్దకు వచ్చి వేలిముద్రలు తీసుకుని నగదు అందజేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో తపాలా కార్యాలయంలో పంపిణీ చేస్తున్నారు.ఈ విషయమై అదనపు డీఆర్‌డీవో నర్సింహులు మాట్లాడుతూ.. నిధులు మంజూరయ్యాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని త్వరలో అందజేస్తామని చెప్పారు.

జిల్లాలో ఇలా
వృద్ధులు: 34,429
వితంతువులు: 48,876
ఒంటరి మహిళలు: 4,659
దివ్యాంగులు: 12,621
కల్లుగీత కార్మికులు: 465
బీడి: 41
చేనేత, ఇతరులు: 166

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని