logo

సీసీఐ రైలు పట్టాల విక్రయానికి పన్నాగం!

‘కంచే చేను మేసింది’ అన్న చందంగా మారింది తాండూరు మండలం కరణ్‌కోటలోని సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పరిస్థితి.

Published : 26 Jan 2023 00:49 IST

కార్మిక సంఘం నాయకుడి నిలదీతతో వెనక్కి  

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ‘కంచే చేను మేసింది’ అన్న చందంగా మారింది తాండూరు మండలం కరణ్‌కోటలోని సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పరిస్థితి. కొందరు మేనేజర్ల ధనార్జన దాహంతో ఏకంగా కర్మాగార సొత్తును విక్రయించి సొమ్ము చేసుకునేందుకు యత్నించారు. గుర్తించిన కార్మిక సంఘం ప్రతినిధి నిలదీతతో సామగ్రిని యథా స్థానానికి తరలించిన ఉదంతం బుధవారం వెలుగుచూసింది.


ఏడాది క్రితమే కొత్తవి ఏర్పాటు

సీసీఐ ఉత్పత్తుల్ని ఎగుమతులకు, ముడి సరుకు దిగుమతులను గూడ్సు రైళ్ల ద్వారా నిర్వహించేందుకు పట్టణం నుంచి కరణ్‌కోట వరకు ప్రత్యేక రైలు మార్గాన్ని మూడు దశాబ్దాల క్రితం నిర్మించారు. పట్టాలు అరిగిపోవడంతో  ఏడాది క్రితం కొత్తవి అమర్చారు. తొలగించిన పాత పట్టాలను రూ.30లక్షల విలువజేయనుండగా చెంగెష్‌పూర్‌ శివారులో రైలు మార్గం వారగా నిల్వ చేశారు. ఇటీవల వాటిపై కన్నేసిన కొందరు సీనియర్‌ మేనేజర్లు తాండూరులోని ఓ రైల్వే అధికారితో కుమ్మకై గుట్టుగా విక్రయించేందుకు పన్నాగం పన్నారు.


తుక్కు కింద అమ్మాలని..

రైలు పట్టాలను పికప్‌ వాహనం ద్వారా పట్టణంలోని రైల్వే స్టేషన్‌ పరిసరాలకు చేరవేశారు. వాటిని ముక్కలుగా విడగొట్టి తుక్కు కింద విక్రయించి సొమ్ము చేసుకుందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘం ప్రతినిధి పాత రైలు పట్టాలను తరలించడంపై ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలంటూ జీఎం మహానా, మెకానికల్‌ మేనేజరు విపుల్‌కుమార్‌పై ఒత్తిడి చేశారు. దీంతో జీఎం ఆరా తీసి వెంటనే రైలు పట్టాలను వెనక్కి తెప్పించాలని ఆదేశించడంతో సిబ్బంది వెళ్లి తీసుకొచ్చారు. గతంలో నిల్వ ఉంచిన ప్రదేశంలో ఉంచడంతో కార్మిక సంఘం ప్రతినిధి, ఒప్పంద కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని