logo

రూ.105 కోట్ల భూమి స్వాహాకు పన్నాగం

భూములకు రక్షకులుగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులే భక్షకులుగా మారారు. రియల్‌ వ్యాపారులతో కలిసి దాదాపు రూ.105 కోట్ల విలువైన భూమి పందేరానికి వ్యూహం పన్నారు.

Updated : 26 Jan 2023 05:29 IST

రియల్టర్లతో ఇద్దరు వీఆర్వోల కుమ్మక్కు

ఈనాడు- హైదరాబాద్‌, షాబాద్‌, న్యూస్‌టుడే: భూములకు రక్షకులుగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులే భక్షకులుగా మారారు. రియల్‌ వ్యాపారులతో కలిసి దాదాపు రూ.105 కోట్ల విలువైన భూమి పందేరానికి వ్యూహం పన్నారు. కొందరు కబ్జాదారులతో కుమ్మక్కై 40 ఎకరాల భూమిని రియల్టర్లకు అప్పగించేందుకు రెవెన్యూ రికార్డులను ఏమార్చారు. ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. 2020లో రంగారెడ్డి జిల్లా షాబాద్‌ ఠాణాలో నమోదైన భూ రికార్డుల ట్యాంపరింగ్‌ కేసులో ఈవోడబ్ల్యూ అధికారులు మంగళవారం ఇద్దరు మాజీ వీఆర్వోలను అరెస్టు చేసింది. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వివరాల ప్రకారం..

రికార్డులు తారుమారు చేసి.. నగరంలోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఎన్‌.జయలక్ష్మి(45)కి రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం సోలిపేటలో 42.22 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిపై కన్నేసిన వసుదేవ రియల్టర్స్‌ సంస్థ ప్రతినిధులు ఎలాగైనా దక్కించుకునేందుకు పథకం పన్నారు. 42 ఎకరాల భూమి తమదేనంటూ కొందరు రెవెన్యూ సిబ్బంది సాయంతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారు. పాత రెవెన్యూ దస్త్రాల్లో అసలైన యజమాని పేరును వైట్‌నర్‌తో చెరిపేసి వాటి స్థానంలో రియల్‌ఎస్టేట్‌ సంస్థ పేరు రాశారు. ఆ తర్వాత పహాణీలో పేర్లు తారుమారు చేశారు. సిబ్బంది సహకారంతో అప్పటి తహసీల్దార్‌ నకిలీ సీల్‌ వాడారు. సంతకాలు ఫోర్జరీ చేశారు. ఆ తర్వాత రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారుల్ని మభ్యపెట్టి భూమి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. నిబంధనల ప్రకారం ఈ స్థలం ఉన్న ప్రదేశంలో సాదాబైనామాకు అవకాశం లేదు. నిందితులు మాత్రం సాదాబైనామా చేయించినట్లు పత్రాలు సృష్టించడం గమనార్హం. ఈ భూమికి తామే హక్కుదారులమంటూ పట్టా పుస్తకాలు తీసుకుని అదే స్థలంలో బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై 2020 నవంబరు 18న షాబాద్‌ ఠాణాలో కేసు నమోదైంది. వాసుదేవ రియల్టర్‌కు చెందిన 14 మందిని నిందితులుగా చేర్చారు. కేసును సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగానికి బదలాయించారు.* రెవెన్యూ రికార్డులను పరిశీలించిన అధికారులు ట్యాంపర్‌ అయినట్లు గుర్తించారు. అప్పట్లో సోలిపేట వీఆర్వోలుగా పనిచేసిన బి.అంజయ్య, ఎన్‌.నరసింహులు నిందితులకు సహకరించినట్లు తేల్చారు. పట్టా పుస్తకాలు రాగానే రియల్టర్‌ సంస్థ ప్రతినిధులు ఎకరా రూ.50 లక్షలకు అమ్ముతామంటూ దాదాపు రూ.20 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని