logo

డబుల్‌ ఇళ్లు.. ఎదురుచూపులు ఇంకెన్నేళ్లు

రాజధాని పరిధిలో దాదాపు 63 వేల రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోగా లక్షలాది మంది దరఖాస్తుదారులు గృహయోగం కోసం ఎదురుచూస్తున్నారు.

Published : 29 Jan 2023 02:35 IST

నిర్మాణం పూర్తయిన 63 వేల నివాసాలు
లబ్ధిదారుల  ఎంపికలో అధికారుల తాత్సారం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

కొల్లూరులో ఇళ్ల సముదాయం

రాజధాని పరిధిలో దాదాపు 63 వేల రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోగా లక్షలాది మంది దరఖాస్తుదారులు గృహయోగం కోసం ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో పూర్తయిన గృహాలు అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మొత్తం రూ.9వేల కోట్లతో..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన పేదలకు ఇంటి సౌకర్యం కల్పించడం కోసం నాలుగేళ్ల కిందట నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. వీటికి దాదాపు రూ.9 వేల కోట్లుఅవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ.1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 68 వేల రెండు పడకల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు అయిదువేల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. రెండు నెలల కిందటే 63 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) అధికారులు ప్రకటించారు. ఈ 63 వేలలో 40 వేల ఇళ్లకు సంబంధించి కాలనీ లోపల తాగునీరు, విద్యుత్తు, రోడ్లు తదితర సౌకర్యాలను కూడా కల్పించారు. మరో 23 వేల ఇళ్ల కాలనీల్లో మాత్రం లోపల భాగంలో విద్యుత్తు, తాగునీరు, రోడ్ల సౌకర్యాలను పూర్తి చేసినా కూడా బయట నుంచి వీటికి తాగునీరు, విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం మరో రూ.400 కోట్లను విడుదల చేస్తే వీటిని వారం రోజుల్లోనే పూర్తి చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఆలస్యం ఎందుకంటే..

దాదాపు రెండు నెలల కిందటే 63 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినా కూడా వాటిని లబ్ధిదారులకు అందజేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి నియోజకవర్గానికి నాలుగువేల రెండు పడకల ఇళ్లను ఇవ్వాలని సర్కార్‌ నిర్ణయించింది. దాదాపు ఏడు లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హులను గుర్తించే పనిని కూడా చాలా వరకు పూర్తయింది. లాటరీ దారా లబ్ధిదారుల ఎంపికకు ఆదేశాలు వెలువడినా అధికారులు ఇప్పటి వరకు ప్రక్రియ పూర్తి చేయలేదు. లబ్ధిదారుల ఎంపిక తర్వాతే తమ వాటా నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ప్రతి ఇంటికి రూ.లక్ష చొప్పున విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు లక్ష ఇళ్లకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేసింది. మరో రెండువేల కోట్ల మేర నిధులు అవసరం. కేంద్రం వాటా మంజూరు కాక, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మిగిలిన 32 వేల ఇళ్ల నిర్మాణం దాదాపుగా ఆగిపోయింది. లబ్ధిదారుల ఎంపిక వేగంగా పూర్తి చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. వీటి ప్రారంభానికి మంత్రులు సమయం ఇస్తే వచ్చే నెల రోజుల్లోనే ఇళ్లు పేదలకు అందే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొంటేనే ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని