logo

పడిపోతున్న పత్తి ధర

ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు నెలల తరబడి ఇళ్లలోనే పత్తి పంటను నిల్వ చేసి ఎదురు చూస్తున్నారు. ధరలు మాత్రం వారి ఆశలను నీరుగారుస్తున్నాయి

Published : 02 Feb 2023 03:21 IST

న్యూస్‌టుడే, పెద్దేముల్‌

ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు నెలల తరబడి ఇళ్లలోనే పత్తి పంటను నిల్వ చేసి ఎదురు చూస్తున్నారు. ధరలు మాత్రం వారి ఆశలను నీరుగారుస్తున్నాయి. జిన్నింగ్‌ మిల్లుల నుంచి డిమాండ్‌ లేనందున మిల్లులు రెండు నెలల క్రితంతో పోలిస్తే రైతులకు చెల్లించే ధరను క్వింటాలుకు రూ.9 వేల నుంచి రూ.7,900కి తగ్గించాయి. పత్తి పంటకు ఈ ఏడాది క్వింటాలుకు రూ.6,300 చొప్పున మద్దతు ధరను కేంద్రం నిర్ణయించింది. ఇంకా ధర పెరుగుతుందేమోనన్న ఆశతో రైతులు మార్కెట్‌కు తీసుకురావడం లేదు. 70 శాతం పంట ఇంకా రైతుల ఇళ్లలోనే నిల్వ ఉంది. పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు.
* సీజన్‌ మొదట్లో క్వింటాలుకు రూ.9,300 ధర పలికింది. ఈ ధర సుమారు 20 రోజుల పాటు కొనసాగింది.
*డిసెంబరు మధ్యలో ధర అమాంతం పడిపోయింది. రూ.7,200 నుంచి రూ.7,300 మధ్యన పలికింది. 15 రోజుల పాటు ఇదే ధర కొనసాగింది.
* సంక్రాంతి తర్వాత ధర పెరగడం మొదలైంది. రూ.7,400 నుంచి రూ.7950 మధ్యన ధర పలుకుతోంది.

దయనీయంగా కౌలు రైతుల పరిస్థితి

పత్తి పంటను సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కౌలు డబ్బులు, విత్తనాలు, ఎరువులు మందులు, డీజీల్‌ ధరలు పెరగడంతో చేసిన అప్పులు భారంగా మారాయి. చేతికి వచ్చిన పంటను అమ్ముకుని భారాన్ని తగ్గించుకుందామని ఆశించారు. రోజు రోజుకు ధర పడిపోతుండటంతో వారు తీవ్ర వేదన చెందుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని