logo

నేర వార్తలు

సరైన ఉద్యోగం లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాట్సాప్‌ స్టేటస్‌లో ఆ విషయాన్ని పెట్టి మరీ ఉరేసుకొన్న ఈ ఘటన అల్వాల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

Published : 09 Feb 2023 01:57 IST

వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి.. యువకుడి ఆత్మహత్య

అల్వాల్‌, న్యూస్‌టుడే: సరైన ఉద్యోగం లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాట్సాప్‌ స్టేటస్‌లో ఆ విషయాన్ని పెట్టి మరీ ఉరేసుకొన్న ఈ ఘటన అల్వాల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వెంకటాపురం ఆదర్శనగర్‌కు చెందిన నీరజ్‌రాజ్‌(30) తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారు. సోదరుడు రోషన్‌తో కలిసి ఉంటున్నాడు. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తూ వేతనం నచ్చక.. ఏడాది కిందట మానేశాడు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో మానసిక ఒత్తిడితో ఉన్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాడు.


లాభాలు ఇస్తానంటే.. ఇంటిని అమ్మి పెట్టుబడి పెట్టాడు

పోలీసుల అదుపులో స్థిరాస్తి
వ్యాపారి హత్య కేసు నిందితుడు?

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో సంచలనం సృష్టించిన స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బార్కాస్‌కు చెందిన టైలర్‌ ఫయాజుద్దీన్‌(42)కు భార్యా, ముగ్గురు పిల్లలు. కొంతకాలం క్రితం ఫయాజుద్దీన్‌కు దిల్‌ఖుష్‌నగర్‌కు చెందిన కేఎంఆర్‌ హోమ్స్‌ రియల్‌ ఎస్టేట్‌సంస్థ అధినేత ముసా సిద్దిఖి(43)తో పరిచయమైంది. తన సంస్థలో పెట్టుబడులు పెట్టినవారికి అధిక మొత్తంలో లాభాలిస్తానని సిద్దిఖి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేశాడు. ఫయాజుద్దీన్‌ తన ఇంటిని విక్రయించి, ఆ సంస్థలో రూ.50లక్షలు పెట్టుబడి పెట్టాడు. కొద్దినెలలపాటు సిద్దిఖి డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది. తర్వాత తాత్సారం చేస్తుండడంతో ఫయాజుద్దీన్‌ చాలాసార్లు సిద్దిఖి ఇంటికి వచ్చి వెళ్లాడు. దాటవేస్తుండడంతో విసిగిపోయిన నిందితుడు, సిద్దిఖిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.


ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రైవేటు కన్సల్టెన్సీ మోసం

పంజాగుట్ట, న్యూస్‌టుడే: వీసా, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, విదేశాలకు పంపిస్తామంటూ యువతను మోసం చేస్తున్న ఓ ప్రైవేటు కన్సల్టెన్సీపై పంజాగుట్ట పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ హరిశ్చంద్రారెడ్డి వివరాల ప్రకారం.. తాజ్‌దక్కన్‌ హోటల్‌లో ఉన్న ఫ్యాబ్రిక్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్న డబిల్‌పురాకు చెందిన మహ్మద్‌ బషీర్‌తో పాటు మరికొందరు.. వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని రెండు సంవత్సరాలుగా పలువురు నుంచి రూ.కోటి వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వారికి ఎప్పటికీ వీసాలు, ఉద్యోగాలు రాకపోవడంతో వివరాల కోసం కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వారికి సరైన సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు పద్మారావునగర్‌కు చెందిన వి.నారాయణభార్గవ్‌ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈయనతో పాటు మరో 41 మంది పేర్లును ఇచ్చారు. ఈ మేరకు చీటింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.


సాఫ్ట్‌వేర్‌ కొలువులంటూ వసూళ్లు.. ఒకరి అరెస్టు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: బ్యాక్‌ డోర్‌ ఎంట్రీల రూపంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలిప్పిస్తాంటూ బీటెక్‌ విద్యార్థులకు గాలం వేసి రూ.లక్షలు వసూలు చేసిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సాయికృష్ణ(25) హుజూర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్‌రావు కరీంనగర్‌లోని వాగేశ్వరి బీటెక్‌ కళాశాల విద్యార్థుల వాట్సప్‌ గ్రూప్‌నకు విప్రోలో ఉద్యోగాలంటూ సందేశం పంపారు. అమీర్‌పేటలో పలు కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులనూ వాట్సప్‌ ద్వారా సంప్రదించారు. 35మంది విద్యార్థుల నుంచి సుమారు రూ.8లక్షల వరకు నిందితులు వసూలు చేశారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.25వేల నుంచి రూ.60 వేల వరకు వెంకటేశ్వర్‌రావు ఫోన్‌కు గూగుల్‌పే, ఫోన్‌పే చేయించుకున్నారు. తరువాత నియామక పత్రాలు అందజేశారు. అనుమానం వచ్చిన పలువురు విద్యార్థులు ఆ పత్రాలను ఆన్‌లైన్‌లో పరీక్షించగా నకిలీవని తేలడంతో పోలీసులను ఆశ్రయించారు. కర్నూలు జిల్లా విద్యార్థిని ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేసిన ఎస్సార్‌నగర్‌ పోలీసులు సాయికృష్ణను అరెస్టుచేశారు. వెంకటేశ్వర్‌రావు కోసం గాలిస్తున్నారు.


హీలియం బెలూన్‌ పేలి నలుగురికి తీవ్ర గాయాలు

కీసర, న్యూస్‌టుడే: ప్రకటనల కోసం ఏర్పాటు చేసిన హీలియంతో నింపిన స్కై బెలూన్‌ పేలి నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కీసరలోని వీఆర్‌ఆర్‌ వెంచర్‌లో స్థిరాస్తి వ్యాపారి వి.రాజిరెడ్డి తన జన్మదినం సందర్భంగా వెంచర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలతో కూడిన స్కై బెలూన్‌ను గాలిలో ఎగరేశారు. మంగళవారం సాయంత్రం బెలూన్‌ను కిందికి దించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలింది. బెలూన్‌లోని హీలియం గ్యాస్‌ లీకై రాజిరెడ్డి డ్రైవర్‌ నిరంజన్‌(46), అంజిరెడ్డి(45), సూపర్‌వైజర్‌ సుధీర్‌గౌడ్‌(30), గొర్రెల కాపరి రాజుయాదవ్‌(29) తీవ్రంగా గాయపడ్డారు. మంటలంటుకొని తల, చేతులు, కాళ్లు 50 శాతానికి పైగా కాలాయి. గుట్టుచప్పుడు కాకుండా నలుగురిని నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


కాలి బాటల ఆక్రమణలపై పోలీసుల దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: నగర వ్యాప్తంగా కాలిబాటల ఆక్రమణలపై సైబరాబాద్‌, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు దృష్టిపెట్టారు. రెండు కమిషనరేట్ల పరిధిలో కూడళ్ల విస్తరణ, ట్రాఫిక్‌ రద్దీపై ఇటీవల సమీక్షించిన అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మూడు రోజులుగా ప్రత్యేక బృందాలతో డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. రాచకొండలో త్వరలో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో చేపట్టిన ఆపరేషన్‌ సత్ఫలితాలిచ్చింది. దీంతో రెండు కమిషనరేట్లలో దృష్టి సారించారు.


క్రెడిట్‌ కార్డు స్వైప్‌ చేసి రూ.5 కోట్లు కాజేత

ఈనాడు, హైదరాబాద్‌:  దమ్మాయిగూడకు చెందిన నవీన్‌గౌడ్‌ క్రెడిట్‌ కార్డులు స్వైప్‌ చేసి యువతకు డబ్బులు ఇచ్చేవాడు. ఇలా చాలా కాలంగా అతని వద్ద నుంచి కొంతమంది రూ.లక్షల్లో తీసుకునేవారు. ఈ క్రమంలో నవీన్‌గౌడ్‌పై వారికి నమ్మకం ఏర్పడింది. ఇదే అదనుగా నవీన్‌గౌడ్‌ వారిని నమ్మించి 50 మంది నుంచి దాదాపు రూ.5 కోట్లు పైగా కాజేసి పరాయర్యాడు.  బాధితులు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు