logo

ఆశల గృహం.. అందుకోని వేగం

జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలపై నీలి నీడలు అలముకున్నాయి. పనులు ప్రారంభించి ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు అందుబాటులోకి రాకపోవడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు.

Published : 25 Mar 2023 02:21 IST

నత్తనడకన ‘డబుల్‌’ నిర్మాణాలు
పాతవి శిథిలం.. కబ్జాల పర్వం

అడవి వెంకటాపూర్‌లో పూర్తయినా కేటాయించని ఇళ్లు

జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలపై నీలి నీడలు అలముకున్నాయి. పనులు ప్రారంభించి ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు అందుబాటులోకి రాకపోవడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వీటిని పూర్తిచేసి పేదలకు అందజేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు పలుమార్లు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. దీంతో పేదల సొంతింటి కల కలగానే మారుతోంది. వాస్తవానికి ఇప్పటికే గృహ ప్రవేశాలు జరిగిపోవాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు.

ఆకాశాన్నంటిన ధరలు

జిల్లాలోని వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో మొదట్లో 5740 ఇళ్లు చేపట్టాలని తలపెట్టినా చివరకు 3,800 తీసుకున్నారు. ఇటీవలి కాలంలో భూముల ధరలు ఆకాశన్నంటాయి. గజం విలువ రూ.15వేల నుంచి రూ.35వేల వరకు  ప్రాంతాలను బట్టి పలుకుతున్నాయి. ఇంకోవైపు సిమెంటు, స్టీలు, రాయి, ఇసుక, ఇటుక ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో స్వతహాగా నిర్మాణం చేసుకోవడం పేదలకు తలకుమించిన భారంగా పరిణమించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లపైనే ఆశలు పెట్టుకున్నారు.

కలెక్టర్‌ ప్రత్యేక చొరవ

డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణాల పట్ల జిల్లా కొత్త కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులతో పలుమార్లు సమీక్ష సమావేశాలను నిర్వహించి పనుల్లో వేగం పెంచేలా చూడాలని ఆదేశించారు. దీంతో అధికారులు, గుత్తేదారులు క్షేత్ర స్థాయికి వస్తున్నారు. మరోవైపు ఆర్థిక సంవత్సరం దగ్గరపడటం కూడా ఇందుకు మరో కారణమని అధికారులు చెబుతున్నారు.

పరిగిలో సాగుతున్న నిర్మాణాలు

ఇదీ లెక్క..

* ప్రారంభం.. ఆరేళ్ల క్రితం
* నిర్దేశిత లక్ష్యం.. 3800
* పూర్తయినవి.. 1543
* నిర్మాణ దశ.. 2500

పర్యవేక్షణ లోపం

పేదలు ఓ వైపు ఎప్పుడెప్పుడా అంటూ వేయి కళ్లతో నిరీక్షిస్తుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. గతంలో డబ్బులు చాలవన్న కారణంగా గుత్తేదారులు పనులు చేపట్టేందుకు వెనకడుగు వేశారు. వారిపై ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లు పెరగడంతో చివరకు ముందుకు వచ్చారు. ధారూర్‌ మండలంలో 120, యాలాల మండలం కోకట్‌లో 180, మర్పల్లిలో 120, తాండూరు పట్టణంలో 401, పరిగిలో 180, కొడంగల్‌లో 48, చౌడాపూర్‌ మండలంలోని అడవి వెంకటాపూర్‌లో 30 చొప్పున దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. పూర్తయిన ప్రాంతాల్లో పర్యవేక్షణ, నిర్వహణ లోపం కనిపిస్తోంది. అడవి వెంకటాపూర్‌లో మందుబాబులకు పక్కాఇళ్లు అడ్డాగా మారింది.

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌, తాండూరు, వికారాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు