logo

నీరంతగా రాదు.. బిందె నిండదు

గ్రేటర్‌ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో తాగునీటి సరఫరా జరుగుతోంది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌ వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సంపులు నిండక ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు.

Published : 29 May 2023 03:46 IST

ట్యాంకర్ల కోసం తప్పని నిరీక్షణ

ఖైరతాబాద్‌లోని శ్రీనివాసనగర్‌లో దుస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో తాగునీటి సరఫరా జరుగుతోంది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌ వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సంపులు నిండక ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. జలమండలి రోజు విడిచి రోజు గంటన్నరపాటు నీటిని సరఫరా చేస్తున్నా.. తక్కువ ఒత్తిడితో వస్తుండటంతో సంపులు సగం కూడా నిండటం లేదు. సాధారణ రోజుల్లో బోర్ల నీరు లభించేది. వేసవిలో చాలా ప్రాంతాల్లో అవి అడుగంటిపోయాయి. దీంతో జలమండలి సరఫరా చేసే నీళ్లే దిక్కు. ప్రస్తుతం అవి కూడా సక్రమంగా రాక అధిక ధరలు పెట్టి ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు.

ఈ డివిజన్లలో అధికం..

మార్చి నుంచి ఇప్పటి వరకు జలమండలి వినియోగదారుల సేవా కేంద్రానికి ఈ తరహా ఫిర్యాదులు 7,663 వచ్చాయి. ఒక్క ఎస్‌ఆర్‌ డివిజన్‌ నుంచే 1,234 మంది జలమండలి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అమీర్‌పేట, యూసుఫ్‌గూడలోని పలు బస్తీలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బస్తీల్లో చాలా ఇళ్లకు సంపులు ఉండవు. బిందెలు, డ్రమ్ముల్లో పట్టుకొని మళ్లీ నల్లా వచ్చే వరకు వాడుకుంటుంటారు. ఒత్తిడి తగ్గడంతో సగం నీరు కూడా లభించడం లేదు. ఆసిఫ్‌నగర్‌ ప్రాంతంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుంచి 670 వరకు ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు జలమండలి అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. సరఫరా తగ్గడం.. పైపులు, వాల్వుల్లో ఇబ్బందుల కారణంగా తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతోంది. కొన్ని ఎత్తైన ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటి చోట ప్రత్యేకంగా బూస్టర్లు పెట్టాల్సిన అవసరం ఉంది.


ప్రత్యామ్నాయం అవసరం

ఈ నేపథ్యంలో జలమండలి ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. సరఫరా సమయంలో అధికారులు క్ష్రేత్రస్థాయిలో పర్యటించడం లేదు. ఎవరైనా అడిగితే 155313 ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారని పలువురు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యకు మూలాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు పైపుల్లో ఇబ్బందులు, లీకేజీల వల్ల సరఫరా తగ్గుతోంది. ఎక్కడెక్కడ సరఫరాలో హెచ్చుతగ్గులు ఉన్నాయో తెలుసుకొని అక్కడ అదనంగా ట్యాంకర్లతో నీటిని అందిస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని