logo

మచ్చలేని మశ్చేందర్‌

ఒక్కసారి గల్లీ నేతగా ఎన్నికైతే చాలు కోట్లకు పడగలెత్తిన వారు నేటి ప్రజాపతినిధుల్లో చాలా మంది కనిపిస్తారు. 

Published : 08 Nov 2023 02:57 IST

సాధారణ జీవితం గడుపుతున్న కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే

అల్వాల్‌, న్యూస్‌టుడే: ఒక్కసారి గల్లీ నేతగా ఎన్నికైతే చాలు కోట్లకు పడగలెత్తిన వారు నేటి ప్రజాపతినిధుల్లో చాలా మంది కనిపిస్తారు.  ఇందుకు భిన్నంగా పదవి చేపట్టింది ప్రజలకు సేవ చేసేందుకే అని నమ్మి తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించారు కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే బింగి మశ్చేందర్‌రావు.

కంటోన్మెంట్‌ శాసనసభ్యుడిగా..: ప్రస్తుతం 89 సంవత్సరాల వయసు ఉన్న మశ్చేందర్‌రావు జనతాపార్టీ తరపున 1978 నుంచి 1983 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. డిగ్రీ చదివిన ఆయన ప్రజాసేవ చేయాలన్న సంకల్పతోనే రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు పోటీ చేసి ఓడినా.. మూడోసారి కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  దశాబ్దం క్రితం వరకు రూ.4వేల పింఛనుతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ఆయన ప్రస్తుతం లభిస్తున్న రూ.50వేల పింఛనుతో అల్వాల్‌లోని రెండు వందల గజాల్లో నిర్మించుకున్న చిన్న ఇంట్లో సాధారణ జీవితం గడుపుతున్నారు. పనుల నిమిత్తం మొన్నటి వరకు బస్సులు, ఆటోల్లోనే ప్రయాణిస్తుండేవారు. ఇంతవరకు సొంత కారు లేదు. ప్రస్తుతం వయసు పైబడటంతో వాకర్‌ సాయంతో తిరుగుతున్నారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు కొంతకాలం క్రితం మృతి చెందారు.  

రాజకీయం వ్యాపారంగా మారి..: మా హయాంలో ప్రజల్లో నాయకులను గౌరవంగా చూసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం డబ్బులు ఇవ్వంది కార్యకర్తలు ప్రచారం చేయడం లేదు. ఎన్నికైన నేతలు కూడా ఆ తర్వాత వారిని పట్టించుకోరు.

చేపట్టిన పదవులు: ఎమ్మెల్యే, సిండికేట్‌ బ్యాంకు డైరెక్టర్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఇండియా డైరెక్టర్‌, హైదరాబాద్‌ టెలికాం సభ్యుడు. ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జువైనల్‌ కోర్టు సభ్యుడిగా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని