logo

కళాకారులకు పదవీ విరమణ ఉండదు

నాటకరంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు.

Published : 17 Apr 2024 02:22 IST

సినీ నటుడు కోట శ్రీనివాసరావు

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: నాటకరంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. మంగళవారం వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో త్యాగరాయగానసభలో తెలుగు రంగస్థల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రచయిత, నటుడు, దర్శకుడు తుర్లపాటి రామచంద్రరావు, ప్రముఖ రంగస్థల, సినీ, టీవీ నటుడు యు.సుబ్బరాయశర్మలకు స్వర్ణవంశీ- యలవర్తి రాజేంద్రప్రసాద్‌ జాతీయ జీవన సాఫల్య పురస్కారాలను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జానపద, పౌరాణిక నాటకాల్లో తుర్లపాటి రామచంద్రరావు బహుముఖ ప్రతిభ కనబర్చారని ప్రశంసించారు. కళాకారులకు ఎప్పటికీ పదవీ విరమణ ఉండదన్నారు. తుర్లపాటి రామచంద్రరావు మాట్లాడుతూ, నాటకాలకు ఎల్లప్పుడూ ప్రజాదరణ ఉంటుందన్నారు. త్యాగరాయ గానసభలో పలు నాటకాలు ప్రదర్శించిన తాను.. అదే వేదికపై జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తొలుత సూర్యప్రకాశరావు రచించిన ‘కొత్త మలుపు’ నాటికను కళాకారులు ప్రేక్షకరంజకంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, వంశీ సంస్థల వ్యవస్థాపకులు వంశీ రామరాజు, ప్రముఖులు టి.సుధాదేవి, యలవర్తి ధనలక్ష్మి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

పురస్కార గ్రహీతలు యు.సుబ్బరాయశర్మ, తుర్లపాటి   రామచంద్రరావులతో కోట శ్రీనివాసరావు, నరసింహారావు, వంశీ రామరాజు, సుధాదేవి, ధనలక్ష్మి, శైలజ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని