logo

ఇళ్ల నిర్మాణం పూర్తయినా... పంపిణీ జాడేదీ..!

నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పాలకుల నిర్లక్ష్యమో అధికారుల పర్యవేక్షణ లేకనో ఇళ్ల నిర్మాణం పూర్తయినా నేటికీ నిరుపేద లబ్ధిదారులకు వాటిని కేటాయించడం లేదు.

Updated : 05 Feb 2023 06:18 IST

లబ్ధిదారులకు తప్పని ఎదురు చూపులు

ఇల్లంతకుంటలో పూర్తయిన రెండు పడకగదుల ఇళ్లు

న్యూస్‌టుడే, ఇల్లంతకుంట: నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పాలకుల నిర్లక్ష్యమో అధికారుల పర్యవేక్షణ లేకనో ఇళ్ల నిర్మాణం పూర్తయినా నేటికీ నిరుపేద లబ్ధిదారులకు వాటిని కేటాయించడం లేదు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, కందికట్కూర్‌, ఓబులాపూర్‌, ఇల్లంతకుంట, పెద్దలింగాపూర్‌ గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కందికట్కూర్‌లో 48, ఒబులాపూర్‌లో 24, పొత్తూరులో 32, పెద్దలింగాపూర్‌లో 40, ఇల్లంతకుంటలో 40 ఇళ్లు నిర్మించారు. చాలాచోట్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. చిన్నచిన్న పనులు చేపట్టాల్సి ఉండగా వాటిని పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో అభ్యంతరాలు వచ్చినా అక్కడ గ్రామ సభలను నిర్వహించి లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు లేకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించారు. ఇల్లంతకుంటలో ఇళ్ల నిర్మాణం పూర్తయింది. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయగా కేటాయింపులకు ఇంకా నిర్ణయించలేదు. దానికి తోడు ఇళ్లలోకి వెళ్లాలంటే సరైనదారి లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ దుస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కందికట్కూర్‌లో డ్రా పద్ధతిలో ఇళ్లు కేటాయించారు. పంపిణీ చేయకముందే పలువురు వాటిని తాత్కాలికంగా వాడుకుంటున్నారు. ఒబులాపూర్‌లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసినా డ్రా నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దలింగాపూర్‌లో సైతం ఇదే దుస్థితి నెలకొంది. ఇళ్లు పంపిణీ చేస్తామని ఏళ్ల తరబడి ఊరిస్తుండటంతో ఆశావహులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రోజురోజుకూ ప్రభుత్వం నిబంధనలు మార్చుతుండటంతో ఎంపికైన ఏ సమస్యలు వచ్చిపడతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దలింగాపూర్‌ గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఇళ్లు పంపిణీ చేయాలంటూ ఇటీవల గ్రామం నుంచి ఇల్లంతకుంటకు పాదయాత్ర చేపట్టారు. ముస్కానిపేటలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంకోసం శిలాఫలకం వేసినా నేటికీ అతీగతీలేదు. నిర్మాణాలు మంజూరైన గ్రామాల్లో ఇళ్లు పూర్తి కాగా ఇక్కడ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. పలుచోట్ల ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ఏళ్లు గడిచాయని.. పూర్తయిన వాటిని పంపిణీ చేసేందుకు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందని అర్హులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని వెంటనే రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు.


ఎంపిక పూర్తయింది
-రవికాంత్‌, తహసీల్దార్‌, ఇల్లంతకుంట

మండలంలోని ఐదు గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక సైతం పూర్తిచేశాం. ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతాం. ఐదు గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్ల కాలనీలో ఎలాంటి సమస్యలు నా దృష్టికి రాలేదు. ఉంటే పంపిణీకి ముందే పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తాం.


ఇబ్బందులు తీర్చాలి
-స్వరూప, పెద్దలింగాపూర్‌

మా గ్రామంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభించి ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. అర్హులైన వారి ఎంపిక పూర్తి చేశారు. పనులు పూర్తి చేసి వెంటనే పంపిణీ చేయాలి. కూలిపోయిన ఇంటిపై కవర్‌ కప్పుకొని ప్రస్తుతం నివాసం ఉంటున్నాం. పాలకులు, అధికారులు వెంటనే ఇళ్లు అందించి ఇబ్బందులు తీర్చాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని