logo

జూన్‌ తర్వాతే సింగరేణి ఎన్నికలు!

సింగరేణి ఎన్నికలు జూన్‌ తర్వాత జరిగే అవకాశాలున్నాయి. ఏప్రిల్‌ 2న ఎన్నికల షెడ్యూలు విడుదల చేసేందుకు కార్మిక శాఖ సిద్ధమవుతున్న నేపథ్యంలో యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

Published : 24 Mar 2023 04:14 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని

సింగరేణి ఎన్నికలు జూన్‌ తర్వాత జరిగే అవకాశాలున్నాయి. ఏప్రిల్‌ 2న ఎన్నికల షెడ్యూలు విడుదల చేసేందుకు కార్మిక శాఖ సిద్ధమవుతున్న నేపథ్యంలో యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 13న కార్మిక సంఘాలతో కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్‌ శ్రీనివాసులు సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టారు. మొదటి త్రైమాసికంలో బొగ్గు ఉత్పత్తిపై ఒత్తిడి ఉంటుందని, జూన్‌ తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17, 21 తేదీల్లో వాదనలు జరగకుండానే వాయిదా పడ్డాయి. తాజాగా గురువారం జరిగిన వాదనల అనంతరం స్పందించిన హైకోర్టు జూన్‌ 1 తర్వాత ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టుకోవచ్చని ఆదేశించినట్లు తెలిసింది. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి ఐదేళ్లు గడిచిపోయిందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించగా 2022, అక్టోబరు 28న ఎన్నికల నిర్వహణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు కార్మిక శాఖ ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టగా తాజా పరిణామంతో అడ్డుకట్ట పడింది.

17 నెలలు గడిచినా..

సింగరేణిలో 2017 అక్టోబరు 5న గుర్తింపు ఎన్నికలు నిర్వహించారు. గుర్తింపు సంఘం కాలపరిమితి అధికారికంగా రెండేళ్లు కానీ.. ఎన్నికలకు ముందు నాలుగేళ్ల కాలపరిమితికి అందరూ అంగీకరించారు. దాని ప్రకారం చూసినా అదనంగా 17 నెలలు గడిచిపోయాయి. కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం జూన్‌ వరకు ఆగాలి. ఆ తర్వాత ప్రక్రియ మొదలు పెడితే మరో నెల సమయం పట్టనుండగా జులై లేదా ఆగస్టులో సింగరేణి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని