logo

లహరి బస్సులకు ఆదరణ

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకెళ్తోంది. ప్రైవేటు రవాణా రంగంతోపాటు పోటీపడి అధునాతన బస్సులు తీసుకొస్తోంది

Updated : 27 Mar 2024 05:49 IST

కరీంనగర్‌-1 డిపోనకు 54 రోజుల్లో రూ.67 లక్షల ఆదాయం

లహరి బస్సు

 న్యూస్‌టుడే, కరీంనగర్‌ రవాణా విభాగం: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకెళ్తోంది. ప్రైవేటు రవాణా రంగంతోపాటు పోటీపడి అధునాతన బస్సులు తీసుకొస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ‘లహరి’ పేరుతో స్లీపర్‌ బస్సులను ప్రవేశ పెట్టింది. కరీంనగర్‌ రీజియన్‌కు ఆరు సర్వీసులు కేటాయించగా.. వాటికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది.

 వేసవిలో డిమాండ్‌..

కరీంనగర్‌-1 డిపో నుంచి బెంగళూరుకు నడుపుతున్న లహరి బస్సులకు సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 25 వరకు రూ.67.15 లక్షల ఆదాయం వచ్చింది. ఒక బస్సు కరీంనగర్‌ నుంచి బెంగళూరు వెళ్లి (వందశాతం ఓఆర్‌) రావాలంటే రూ.1.87 లక్షలు రావాలి. ప్రస్తుతం సగటున రూ.96 వేలు ఆదాయం, 52 శాతం ఓఆర్‌ నమోదవుతోంది. డీజిల్‌, చోదకుడి వేతనం, టోల్‌ఛార్జి, ఇతర ఖర్చులు రూ.60 వేలు అవుతాయని డీఎం లక్కు మల్లేశం తెలిపారు. గోదావరిఖని డిపోనకు సంబంధించి వంద శాతం ఓఆర్‌ వస్తే రూ.1.80 లక్షల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం రూ.60 వేల ఆదాయం, 41 శాతం ఓఆర్‌ వస్తున్నట్లు ఆ డిపో మేనేజర్‌ నాగభూషణం తెలిపారు. వేసవి కాలం కావడం, ఎండలు పెరిగిపోతుండటంతో ప్రయాణికులు ఏసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. వేసవి కావడంతో లహరి బస్సులకు డిమాండ్‌ భారీగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

బెంగళూరుకు మూడు  సర్వీసులు...

కరీంనగర్‌-1కు 4, గోదావరిఖని డిపోనకు 2 కేటాయించారు. ఈ బస్సులో 22 సీట్లు, 20 స్లీపర్‌ బెర్తులు ఉన్నాయి. ఉచిత వైఫై, ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు. లహరి బస్సులను కరీంనగర్‌, గోదావరిఖని నుంచి బెంగళూరుకు నడుపుతున్నారు. కరీంనగర్‌ నుంచి 2 సర్వీసులు, గోదావరిఖని నుంచి ఒక సర్వీసు నడుపుతున్నారు. ప్రతి రోజు సాయంత్రం 5, 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30, 6.30కు తిరిగి ప్రయాణమవుతాయి.

టికెట్‌పై పది శాతం రాయితీ

ప్రస్తుతం వేసవి కావడంతో చాలా మంది ఏసీ బస్సుల్లో ప్రయాణానికి మొగ్గు చూపుతారు. వర్ష, చలికాలాల్లో ఏసీ బస్సుల్లో తక్కువ మంది వెళ్తుంటారు. సందర్భాన్ని బట్టి లహరి ఛార్జీల్లో మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సర్వీసుల్లో టికెట్‌ ఛార్జీపై పది శాతం రాయితీ ఇస్తున్నారు. ఏప్రిల్‌ 30 వరకు ఈ రాయితీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఇవీ ప్రత్యేకతలు

  •  బస్సులో మొత్తం 42 మంది ప్రయాణించవచ్చు. 22 సీట్లు కూర్చోవడానికి, 20 బెర్తులు పడుకోవడానికి ఉంటాయి.
  •  ఎవరి సీట్ల వద్ద వాళ్లు ఏసీని అవసరం మేరకు కంట్రోల్‌ చేసుకోవచ్చు.
  •  బెడ్‌లైట్‌ సౌకర్యమూ ఉంది.
  •  బస్సుకు రివర్స్‌ కెమెరాతోపాటు లోపల 3 సీసీ కెమెరాలు అమర్చారు.
  •  అనౌన్స్‌మెంట్‌ చేయడానికి చోదకుడి క్యాబిన్‌లో మైక్‌ ఉంది.
  •  జీపీఎస్‌కు అనుసంధానం ఉండటంతో ప్రయాణికులు గమ్యం యాప్‌ ద్వారా బస్సు ఎక్కడ వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు.

ప్రైవేటు బస్సులకు దీటుగా సేవలు

లహరి బస్సులకు ఇప్పుడిప్పుడే ప్రయాణికుల నుంచి ఆదరణ వస్తోంది. వేసవి కావడంతో మరింత పెరుగుతుందని అనుకుంటున్నాం. ప్రైవేట్‌ బస్సులకు దీటుగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
-ఎన్‌.సుచరిత, ఆర్‌ఎం, కరీంనగర్‌ రీజియన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని