logo

ఎంపీగా గెలిపిస్తే దిల్లీకి రైలు

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే జగిత్యాల-దిల్లీ మధ్య రైలుమార్గం వేయిస్తానని శాసనమండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు.

Updated : 27 Mar 2024 05:58 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాల, న్యూస్‌టుడే: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే జగిత్యాల-దిల్లీ మధ్య రైలుమార్గం వేయిస్తానని శాసనమండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాలలో పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితాంతం నిస్వార్థంగా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నానని అవకాశం వచ్చినప్పుడల్లా జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానన్నారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలందించానని జగిత్యాలకు ప్రధానమైన యావర్‌రోడ్డును గతంలో అందరి అంగీకారంతో 60 అడుగులకు విస్తరించానని వివరించారు. ప్రస్తుతం రూ.100 కోట్లు కేటాయించి 100 అడుగులకు విస్తరించేలా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జగిత్యాలలో రూ.200కే నల్లా కనెక్షన్‌ ఇచ్చి మండు వేసవిలోనూ ప్రతిరోజు తాగునీరందించామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో ఎంపీగా గెలిస్తే మరింత అభివృద్ధి చేయవచ్చని జీవన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి, మాజీ ఛైర్మన్లు గిరినాగభూషణం, జి.ఆర్‌.దేశాయి, టి.విజయలక్ష్మి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు ఆకుబత్తిని శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని