logo

గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్‌తో కలకలం

సారంగాపూర్‌ పోలీసుస్టేషన్‌ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్‌కు గురవడం కలకలం రేపింది.

Updated : 19 Apr 2024 05:30 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: సారంగాపూర్‌ పోలీసుస్టేషన్‌ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్‌కు గురవడం కలకలం రేపింది. ఈ మేరకు మల్టీజోన్‌-1 ఐజీ ఎ.వి.రంగనాథ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం నుంచి అంబులెన్స్‌లో 70 కిలోల గంజాయి రాజస్థాన్‌కు తరలిస్తుండగా 2023 ఫిబ్రవరి 1న సారంగాపూర్‌ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలించే నలుగురిని రిమాండ్‌కు పంపించి గంజాయితో సహా అంబులెన్స్‌ను పోలీసుస్టేషన్‌ ఆవరణలో ఉంచారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు అంబులెన్స్‌ అద్దం పగులగొట్టి గంజాయిని మాయం చేశారు. ఈనెల 1న సంఘటన వెలుగు చూడగా జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై నివేదిక పంపించిన నేపథ్యంలో అప్పటి ఎస్సై జి.మనోహర్‌రావు, ప్రస్తుత ఎస్సై ఎ.తిరుపతి, హెడ్‌కానిస్టేబుల్‌ బి.రవీందర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ టి.నరేందర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గంజాయిని పట్టుకున్న హెడ్‌కానిస్టేబుల్‌ బి.రవీందర్‌రెడ్డి సస్పెండ్‌ కావడం విస్మయానికి గురి చేసింది.
దొరికిన దొంగలు! : పోలీసుస్టేషన్‌ ఆవరణలో నిలిచి ఉంచిన వాహనం నుంచి గంజాయి మాయమైన సంఘటనను జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు రకాలుగా విచారణ జరపగా గంజాయి మాయం చేసిన వారిని గుర్తించారు. మండలంలోని రంగపేట, రేచపల్లికి చెందిన మైనర్లు సంఘటనకు బాధ్యులుగా తేలినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని