logo

బ్యాలెట్‌ యుద్ధానికి చకచకా సన్నద్ధం

లోక్‌సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

Updated : 24 Apr 2024 06:10 IST

లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం

జిల్లా కంట్రోల్‌ రూంలో సిబ్బందితో పర్యవేక్షిస్తున్న  జిల్లా నోడల్‌ అధికారి రవీందర్‌

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌ : లోక్‌సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుండటంతో బరిలో నిలిచే అభ్యర్థుల కదలికలు, ప్రచారాలపై ఓ కన్నేసింది. నిఘా బృందాలతో నిరంతరం పర్యవేక్షిస్తోంది. స్వేచ్ఛాయుత, పారదర్శకత ఎన్నికలకు అమలు చేస్తున్న సి-విజిల్‌, 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఫిర్యాదులపై, ప్రచార అనుమతల కోసం సువిధ యాప్‌ల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం చేయడంతో స్పందన పెరుగుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారాలు, రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలను గమనిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

నియోజకవర్గాల్లో ఈవీఎంలు భద్రం

లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఈవీఎంలను జిల్లాలో మొదటి విడతలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేశారు. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ప్రతి ఒక యంత్రం పనితీరు, సాంకేతిక సమస్యలను పరిశీలించి సందేహాలను తొలగించారు. ఇక్కడ నుంచి నియోజకవర్గాలకు తరలించారు. రామగుండం నియోజకవర్గంలో 325 బ్యాలెట్‌ యూనిట్లు, 325 కంట్రోల్‌ యూనిట్లు, 364 వీవీప్యాట్లు, మంథనిలో 362 బ్యాలెట్‌, 362 కంట్రోల్‌ యూనిట్లు, 406 వీవీప్యాట్లు, పెద్దపల్లిలో 362 బ్యాలెట్‌ యూనిట్లు, 362 కంట్రోల్‌ యూనిట్లు, 406 వీవీప్యాట్లను ప్రత్యేక గోదాంలో భద్రపరిచారు. నియోజకవర్గ స్థాయిలో రెండోసారి పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు.

పెరుగుతున్న సామాజిక స్పృహ

ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఫ్లయిండ్‌ స్క్వాడ్స్‌, స్టాటిక్‌ సర్వైలెన్స్‌, వీడియో వ్యూవింగ్‌, ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు పారదర్శకత ఎన్నికల కోసం ప్రజల్లో సామాజిక స్పృహ పెరుగుతోంది. జిల్లా కంట్రోల్‌ రూమ్‌లోని 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌కు 76, సి-విజిల్‌ 13, ఎన్‌జీఎస్పీ (నేషనల్‌ గ్రీవెన్సెస్‌ సర్వీసు పోర్టల్‌) 56 చొప్పున ఫిర్యాదులు రాగా వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తున్నారు. జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. 24 గంటల పాటు విడతల వారీగా సిబ్బంది విధుల్లో కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు