logo

పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్‌ నామినేషన్‌

పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్‌ తరఫున వెలిచాల రాజేందర్‌రావుతో నామినేషన్‌ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

Published : 24 Apr 2024 05:34 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌ 

సమావేశంలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే  సత్యనారాయణ, పార్టీ నేత రాజేందర్‌రావు

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్‌ తరఫున వెలిచాల రాజేందర్‌రావుతో నామినేషన్‌ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి నామినేషన్‌ వేయరనే సమాచారం ఉందన్నారు. పార్టీపరంగా కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో ఎవరితో తనకు విభేదాలు లేవని తెలిపారు. మరి పక్క నియోజకవర్గంలో ఉన్నాయా? అని విలేకరులు ప్రశ్నించగా... కొన్ని ఇబ్బందులున్నాయని కానీ తాను తట్టుకోగలనని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఎంపీ బండి సంజయ్‌ రూ.1200 కోట్లు అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు. అందులో శాశ్వతంగా ఉండే 12 అభివృద్ధి పనులు చెప్పాలన్నారు. వరంగల్‌ జాతీయ రహదారిని వినోద్‌కుమార్‌ ఒక ఆసుపత్రి మీదుగా ఆ లైన్‌ మార్పిస్తే ఎందుకు పట్టించుకోలేదని ఆరోపించారు. తాళ్లపల్లిలో తాటిచెట్లు కాలిపోతే కోడ్‌ ఉల్లంఘించి ఎంపీ ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇచ్చారు. తాము ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పామన్నారు. కాంగ్రెస్‌ నేత వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ.. ఎంపీ సంజయ్‌ కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ పనుల్లో అవినీతి జరిగినా విచారణ చేయించలేదని ఆరోపించారు. గ్రానైట్‌ వ్యాపారులు, స్థానిక ఎమ్మెల్యే కమలాకర్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకొని కుమ్మక్కు అయ్యారని మండిపడ్డారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.  సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, సత్యనారాయణగౌడ్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు పద్మాకర్‌రెడ్డి, ప్రసన్నరెడ్డి, తాజుద్దీన్‌, రాహుల్‌, పి.శ్రీనివాస్‌, భాస్కర్‌రెడ్డి, అనిల్‌, మోసిన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో మండల, బ్లాక్‌, పట్టణ నగర, డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులతో ప్రచార సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఈనెల 25 నుంచి మండలాల పర్యటన చేస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలతోపాటు పార్టీ అగ్రనాయకుల సభలు కూడా ఉంటాయన్నారు. 19వ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి నియామక విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి బాహబాహీకి దిగగా.. నేతలు జోక్యం చేసుకొని సర్దిచెప్పినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు