logo

అలుపెరుగని రేసుగుర్రం

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు 92 సంవత్సరాల శ్యామనూరు శివశంకరప్ప మరోసారి విజయభేరి మోగించారు.

Published : 14 May 2023 05:39 IST

శ్యామనూరు శివశంకరప్ప

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు 92 సంవత్సరాల శ్యామనూరు శివశంకరప్ప మరోసారి విజయభేరి మోగించారు. ఆయనకు పార్టీ టికెట్‌ కేటాయించిన సమయంలో విమర్శలు వెల్లువెత్తాయి. వయోవృద్ధుడికి టికెట్‌ ఏమిటనే ప్రశ్న తలెత్తింది. ఆయన గెలిచి ఏమి చేస్తారు అంటూ సొంత పార్టీ నేతలే నిలదీశారు. వారి వాదనలకు శ్యామనూరు గట్టి సమాధానమే చెప్పారు. ‘నేను రేసుగుర్రాన్ని. నా సత్తా చూసే కాంగ్రెస్‌ పార్టీ నాకు టికెట్‌ ఇచ్చింది. భారీ మెజార్టీతో గెలుస్తా’ అని సవాల్‌ చేశారు. అలా చెప్పడమే కాదు.. తన ప్రత్యర్థిపై 28 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా బరిలో దిగడం ఆయన ప్రత్యేకత. దావణగెరె దక్షిణ విధానసభ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. శివశంకరప్పకు 84,298 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి అజయ్‌కుమార్‌కు 56,410 ఓట్లే దక్కాయి. 2004లో లోక్‌సభ ఎన్నికల్లో దావణగెరె నుంచే నెగ్గడం నిన్నమొన్నటి చరిత్ర. మొత్తం ఆరుసార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించారు. బాపూజీ విద్యాసంస్థల అధిపతిగా ఎదిగిన ఆయనను దావణగెరె ప్రజలు ‘అప్పాజీ’ అంటూ అభిమానంతో పిలుస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని