logo

నిండుగా వెళ్లి.. నిండా ముంచి

నిబంధనల కళ్లకు గంతలు కట్టి భారీ సామర్థ్యంతో వాహనాలు తిప్పుతున్నారు. రవాణా శాఖ ఆదేశాలు విస్మరించి నిండుగా ఇసుక నింపి తరలిస్తున్నారు.

Published : 28 Jan 2023 01:48 IST

ఇసుక వాహనాలతో రోడ్లు ఛిద్రం
20 టన్నులకు మించి వెళ్లొద్దన్న న్యాయస్థానం

భారీ సామర్థ్యంతో వెళ్తున్న టిప్పర్‌

ఈనాడు-కర్నూలు, సి.బెళగల్‌-న్యూస్‌టుడే: నిబంధనల కళ్లకు గంతలు కట్టి భారీ సామర్థ్యంతో వాహనాలు తిప్పుతున్నారు. రవాణా శాఖ ఆదేశాలు విస్మరించి నిండుగా ఇసుక నింపి తరలిస్తున్నారు. ‘‘ అధిక బరువుతో వెళ్తున్న ఇసుక వాహనాల కారణంగా రోడ్లు ఛిద్రమవుతున్నాయి... గ్రామాలకు బస్సులు రాని పరిస్థితి నెలకొందని ’’ కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కర్నూలు-తిమ్మనదొడ్డి- మంత్రాలయం రహదారిలో 20 టన్నుల బరువు మించిన లారీలు అనుమితించొద్దని ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాలు ఎవరూ పట్టించుకోలేదు.. అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయలేదు.. అధిక బరువుతో ఇసుక వాహనాలు శుక్రవారం దర్జాగా వెళ్లాయి.


నరక దారులుగా మారాయి

గుంతలమయంగా ముడుమాల దారి

కె.సింగవరం, కొత్తకోట రీచ్‌ల నుంచి ఇసుక వాహనాలు పోలకల్లు, గూడూరు, సుంకేసుల మీదుగా నిడ్జూరు- మునగాలపాడు - కర్నూలు రోడ్డుపై వెళ్తున్నాయి. ముడుమాల, పల్‌దొడ్డి, కొండాపురం రీచ్‌ల నుంచి ముడుమాల-పోలకల్లు మీదుగా గూడూరు-కర్నూలు, ఎమ్మిగనూరు-ఆదోని మార్గంలో తిరుగుతున్నాయి. పల్‌దొడ్డి, కొండాపురం రీచ్‌ల నుంచి గుండ్రేవుల-సంగాల-పలుకుదొడ్డి మీదుగా సి.బెళగల్‌, ఎమ్మిగనూరుకు వెళ్తుంటాయి. ఆయా మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

* సంగాల నుంచి గురజాల వెళ్లే దారిలో రోడ్డుపై ఉన్న కల్వర్టు వాహనాల ధాటికి పూర్తిగా దెబ్బతింది.


బస్సులు బంద్‌..ఆటోలే దిక్కు

మాది కొండాపురం. పదో తరగతి చదువుతున్నా. కొండాపురం నుంచి ముడుమాల ఉన్నత పాఠశాలకు గతంలో ఆర్టీసీ బస్సులో వెళ్లేవాళ్లం. రోడ్డు బాగోలేదని ప్రస్తుతం బస్సు సర్వీసులు సరిగా తిప్పడం లేదు. చేసేది లేక ఆటోలో ప్రమాదకరంగా వెళ్తున్నాం. నెలకు రూ.600 చెల్లిస్తున్నాం. ఆటోలు రాకపోతే ఒక్కోసారి 60 మంది కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం.

శ్రీలత, ముడుమాల, ఉన్నత పాఠశాల విద్యార్థిని


అధికారానికి భయపడి.. తనిఖీలు మరిచారు

* పది టైర్ల లారీలో 25 టన్నులు, 12 టైర్లు.. 31 టన్నులు, 16 టైర్ల లారీలో 35 టన్నుల మేర తీసుకెళ్లడానికి అనుమతులు ఉన్నాయి. దీంతోపాటు లోడుపై 3 టన్నులు మార్జిన్‌ ఇచ్చి, అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో వెళ్తే కేసులు నమోదు చేసే అధికారం రవాణా శాఖ అధికారులకు ఉంది. అధిక సామర్థ్యంతో వెళ్తున్న వాహనాలు గుర్తించి అదనంగా నింపిన లోడుకు ఒక టన్నుకు రూ.2-10 వేల వరకు జరిమానా విధించొచ్చు.

* రీచ్‌ల నుంచి 10 టైర్ల లారీ 30-35 టన్నుల లోడుతో ఇసుక తీసుకెళ్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తడి ఇసుక కావడంతో మరింత బరువు ఉండటంతో రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయి. గుత్తేదారులు అధికార పార్టీ నేతలు కావడంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయడానికి సాహసించడం లేదు.


రాత్రింబవళ్లు రాకపోకలు

* సి.బెళగల్‌ మండలంలో కొత్తకోట, కె.సింగవరం, ఈర్లదిన్నె, ముడుమాల, పల్‌దొడ్డి, కొండాపురం పరిధిలో ఇసుక రీచ్‌లున్నాయి. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, మరో నాయకుడు ఉప గుత్తేదారులుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో రీచ్‌ నుంచి నిత్యం 2 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక తరలిస్తున్నారు. రీచ్‌ల వద్ద వేబ్రిడ్జిలు ఏర్పాటు చేయలేదు. సీసీ కెమెరాలు మచ్చుకైనా కనిపించవు. గతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుకు తాళం వేశారు.

* గత ప్రభుత్వ హయాంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే వాహనాలకు అనుమతి ఉండేదని, ఇప్పుడు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాయి. గ్రీన్‌కో ప్రాజెక్టు పనులకు ఇసుక తీసుకెళ్లే లారీలు 55 టన్నుల సామర్థ్యంతో, నాడు-నేడు పనులకు సంబంధించి 45 టన్నుల మేర ఇసుక నింపి వాహనాలను పంపిస్తున్నారు. ప్రభుత్వ నిర్మాణాల పేరుతో ఇసుకను తీసుకెళ్లి బయట విక్రయిస్తున్నారు.


108 వాహనాలు రావడం లేదు
-నడిపి పెద్దయ్య, ఈర్లదిన్నె

ఈర్లదిన్నె నుంచి కర్నూలుకు వెళ్లాలంటే గతంలో గంట సమయం పట్టేది. రోడ్లు ధ్వంసం కావడంతో ప్రస్తుతం 3 గంటలు పడుతోంది. ద్విచక్ర వాహనాల్లో వెళ్లాలంటే నరకం చూడాల్సి వస్తోంది. రీచ్‌ల పరిధిలోని గ్రామాల్లోకి 108 వాహనాలు రావడం లేదు. ఎవరికైనా ఆరోగ్యం విషమిస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది.


ఆటోకు రూ.40 వేల ఖర్చు
- మనోహర్‌, ఆటో డ్రైవర్‌

ముడుమాల-గూడూరు-కర్నూలు రహదారిపై నిత్యం మూడు ట్రిప్పులు ఆటో నడిపేవాడిని. రోడ్డు అధ్వానంగా మారడంతో ఒక్కసారి వెళ్లి రావడమే గగనమవుతోంది. సరకులు, ప్రయాణికులను రవాణా చేయగా వచ్చిన ఆదాయం ఆటో మరమ్మతులకు సరిపోవడం లేదు. గత నెల సర్వీసుకి ఇస్తే రూ.40 వేల ఖర్చు వచ్చింది. ఇలాగైతే ఆటోడ్రైవర్లు బతికేది ఎలా.


నడుం నొప్పి బాధిస్తోంది

ఇసుక లారీలతో రోడ్లు గుంతలమయమయ్యాయి. మోకాళ్ల లోతు గుంతల్లో బస్సులు తిప్పాలంటే మరమ్మతులకు గురవుతున్నాయి. ఆయా రోడ్లల్లో సర్వీసు తిప్పడానికి విధులు కేటాయిస్తున్నారంటేనే హడలిపోతున్నాం. ప్రయాణికుల కష్టాలు దృష్టిలో పెట్టుకుని సర్వీసు తిప్పుతుంటే మా ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ రోడ్ల వల్లనే నడుం నొప్పి వచ్చింది.

లక్ష్మీనాయక్‌, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు