logo

వలస విద్యార్థికి అవస్థలే!

తల్లిదండ్రులు వలస వెళ్లారు. పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. పాఠశాలలో హాజరు శాతం తగ్గకుండా ఉండాలని సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేసింది.

Updated : 06 Feb 2023 05:40 IST

సీజనల్‌ హాస్టళ్ల నిర్వహణ గాలికి

రాత్రివేళలో ఇంటికి పంపుతున్న సిబ్బంది

ఆదోని మండలం పెద్దతుంబళంలోని హాస్టల్‌ వద్ద విద్యార్థులు

ఆదోని గ్రామీణం, ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు వలస వెళ్లారు. పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. పాఠశాలలో హాజరు శాతం తగ్గకుండా ఉండాలని సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేసింది. అవి అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. ఆదోని డివిజన్‌లో 71 సీజనల్‌ హాస్టళ్లు మంజూరయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. పత్తికొండ మండలంలో నాలుగు కేంద్రాలు మంజురు కాగా ఒకటి మాత్రమే ప్రారంభించారు.
ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామంలో ఏపీ సమగ్రశిక్ష సౌజన్యంతో విశాల గ్రూప్‌, శ్రీ భీమాంజనేయ పొదుపు గ్రూప్‌లకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. జనవరి 11, జనవరి 19 తేదీల్లో సీజనల్‌ వసతిగృహాలను ప్రారంభించారు. గ్రామంలో రెండు ఒకేచోట ఏర్పాటు చేశారు. రెండు చిన్న గదుల్లో కనీస వసతులు లేవు.   విశాల సంఘంలో 52 మంది, భీమాంజనేయ సంఘంలో 28 మంది పిల్లలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. ఆదివారం ‘న్యూస్‌టుడే’ పరిశీలించగా మొత్తం 80 మందికిగాను 28 మంది విద్యార్థులే ఉన్నారు. అన్నం, నీళ్లు చారు వడ్డించారు. ఉపాధ్యాయుడు, కేర్‌టేకర్‌, వంట మనిషి, సహాయకుడు ఉండటం లేదు. రాత్రి వేళలో పిల్లలను ఇంటికి పంపిస్తున్నామని సిబ్బంది తెలిపారు.

* ఆదోని ఎంఈవో శివరాములు మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

మంజూరైనా.. ప్రారంభించలేదు పత్తికొండ మండంలోని దూదేకొండ, జూటూరు, పెద్దహుల్తి గ్రామాలకు మరో ఐదు వసతిగృహాలు మంజూరయ్యాయి. నిర్వహణ బాధ్యత దక్కించుకున్న అధికార పార్టీకి చెందిన ఓ నేత వాటిని ప్రారంభించలేదు. ఆయా గ్రామాల్లో విద్యార్థులు తమ తల్లిదండ్రుల వెంట వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.  


సెలవు రోజుల్లో ఇంటికే..

భోజనం చేస్తున్న విద్యార్థులు

మండల పరిధిలోని పుచ్చకాయలమడ గ్రామంలో రెండు వసతిగృహాలను 2022 నవంబరు 18న ప్రారంభించారు. రెండూ ప్రాథమిక పాఠశాలలోని పాత భవనాల్లో కొనసాగుతున్నాయి. మొత్తం 103 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో కేంద్రంలో ఇద్దరు కేర్‌ టేకర్లు, ఇద్దరు టీచర్‌, వాలంటీరు ఉండగా.. ఒక కేర్‌టేకర్‌, ఒక టీచర్‌ సెలవులో ఉన్నారు. ఆదివారం రెండు కేంద్రాల్లో కలసి 60 శాతం మంది విద్యార్థులే ఉన్నారు. సెలవు రోజు కావటంతో కొందరు పిల్లలు ఇంటి వద్దనే ఉంటున్నారని తెలిసింది. రాత్రి 7 గంటలకు పిల్లలు తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం


మధ్యాహ్నానికే మూత

హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామంలోని సీజనల్‌ వసతిగృహంలో దాదాపు 50 మంది విద్యార్థుల వరకు వసతి పొందుతున్నారు. గది చిన్నదిగా ఉండటంతో ఆరుబయట కూర్చొని చదువుకోవాల్సి వస్తోందని విద్యార్థులు తెలిపారు. దీనికితోడు మెనూ సక్రమంగా అమలుకావడం లేదని పేర్కొన్నారు. వసతిగృహ నిర్వాహకుడు అక్కడే ఉండాల్సి ఉండగా ఆదివారం తాళం వేసుకుని బయటకు వెళ్లడంతో విద్యార్థులు ఆరు బయటే చదువుకుంటున్నారు.

న్యూస్‌టుడే, హాలహర్వి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని