logo

సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు

ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.

Published : 25 Apr 2024 05:14 IST


పత్తికొండ, పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. నాడు- నేడు పథకం పరిధిలో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలాయి. పిల్లలకు సౌకర్యాల మాట దేవుడెరుగు.. పూర్తికాని నిర్మాణాలతో అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు మొదలయ్యాయి.. ఎన్నికల ప్రచారాలు సాగుతున్నాయి.. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం సమస్యలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి.

మారని తీరు..

 * పత్తికొండ మండల పరిధిలోని జూటూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు సుమారు 219 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఐదు గదులు ఉండగా.. ఓ గదిలో నాడు- నేడు సామగ్రి, సిమెంటు నిల్వలు ఉంచారు. మరో గది పాఠశాల సిబ్బంది వినియోగించుకుంటున్నారు. రెండో విడత నాడు- నేడు కింద రూ.48లక్షల వ్యయంతో చేపట్టిన అదనపు గదుల నిర్మాణం ఏడాదిన్నరైనా పూర్తికాలేదు. దీంతో విద్యార్థులు తరగతి గదుల కొరత కారణంగా పాఠశాల వరండా, ఆరుబయట మైదానంలో, చెట్ల కింద కూర్చొని చదువులు సాగించారు. వచ్చే విద్యాసంవత్సరమైనా.. అవస్థలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 * మద్దికెర మండలం అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 69 మంది విద్యార్థులున్నారు. గతంలో ఇక్కడ ప్రాథమికోన్నత పాఠశాల ఉండేది. అదనపు గది నిర్మించారు. గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పనులు పూర్తికాలేదు. మొదటి విడతలో ఈ పాఠశాలలో నాడు- నేడు పనులు చేపట్టి పూర్తిచేశారు. అవసరమైన ఈ గది నిర్మాణాన్ని మాత్రం పూర్తి చేయకుండా ఇలాగే వదిలేశారని స్థానికులు ఆగ్రహిస్తున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని