logo

మయూరిలో పక్షుల సంరక్షణ కేంద్రం

పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచే కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కు (మయూరీ నర్సరీ) ఇక పక్షుల కిలకిలరావాలతో సందడి చేయనుంది.. ఎకరం స్థలంలో రూ.1.65 కోట్లతో ఏర్పాటు చేయనున్న పక్షుల సంరక్షణ కేంద్రం పార్కుకు మరింత వన్నె తేనుంది..

Published : 04 Jun 2022 06:33 IST

పరిపాలన అనుమతి ఇచ్చిన అటవీశాఖ

రూ.1.65 కోట్ల వ్యయంతో ఎకరా స్థలంలో ఏర్పాటుకు నిర్ణయం

న్యూస్‌టుడే, పాలమూరు


మహబూబ్‌నగర్‌ సమీపంలో ఉన్న కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కు

పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచే కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కు (మయూరీ నర్సరీ) ఇక పక్షుల కిలకిలరావాలతో సందడి చేయనుంది.. ఎకరం స్థలంలో రూ.1.65 కోట్లతో ఏర్పాటు చేయనున్న పక్షుల సంరక్షణ కేంద్రం పార్కుకు మరింత వన్నె తేనుంది.. కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర అటవీశాఖ పరిపాలన ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ జూ పార్కులో, మేడ్చల్‌ జిల్లాలో మాత్రమే పక్షుల సందర్శన కేంద్రం ఉంది. మూడోది మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని మయూరీ నర్సరీలో నిర్మించనున్నారు. అందుకోసం మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలకు వెళ్లి అక్కడున్న పక్షుల సంరక్షణ, సందర్శన కేంద్రాలను పరిశీలించనున్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌తోపాటు అటవీశాఖ ఉమ్మడి జిల్లా కన్జర్వేటర్‌, డీఎఫ్‌వో తదితరులు త్వరలోనే ఆయా ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈ మేరకు జిల్లా అటవీశాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

కేసీఆర్‌ ఎకో పార్కును వివిధ పథకాల ద్వారా రూ.7.40 కోట్లతో 2,087 ఎకరాల్లో సుందరంగా అభివృద్ధి చేశారు. ఈ పార్కును చూడటానికి హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు జిల్లాకు వస్తున్నారు. ఇప్పుడు మరో అరుదైన పక్షుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుండటంతో ఈ పార్కుకు మరింత శోభ రానుంది.

11 రకాల జాతులకు చెందిన పక్షులు : కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో ఏర్పాటు చేసే సందర్శన కేంద్రంలో 11 రకాల జాతులకు చెందిన పక్షులను ఉంచనున్నారు. మకావోస్‌ ఫించ్‌, కాక్‌టెల్‌, రెయిన్‌బో లోరీకీట్‌, లవ్‌ బర్డ్స్‌, రోసెల్లా, బడ్‌గేరీగర్‌, పారాకీట్‌, కోక్కాటో, టర్కీ, పీజియన్‌ తదితర జాతుల 100కు పైగా పక్షులను కేంద్రంలో సంరక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయమై జిల్లా అటవీశాఖ అధికారి గంగారెడ్డితో మాట్లాడగా కేసీఆర్‌ అర్బన్‌ ఏకో పార్కులో పక్షుల సందర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందుకోసం త్వరలోనే వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన పక్షుల కేంద్రాలను పరిశీలిస్తామని, మంచి ప్రమాణాలను పాటించి ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని