logo

ప్రజాప్రతినిధుల వాడ.. ధన్వాడ

జిల్లాలో ఉమ్మడి ధన్వాడ మండలం(మరికల్‌ కలుపుకొని) ప్రజాప్రతినిధులను తయారు చేసే కర్మాగారంగా పేరు గాంచింది. ఇప్పటి వరకు ఆరుగురు నాయకుల్ని రాష్ట్ర స్థాయికి పరిచయం చేసింది.

Updated : 25 Oct 2023 06:43 IST

న్యూస్‌టుడే-ధన్వాడ: జిల్లాలో ఉమ్మడి ధన్వాడ మండలం(మరికల్‌ కలుపుకొని) ప్రజాప్రతినిధులను తయారు చేసే కర్మాగారంగా పేరు గాంచింది. ఇప్పటి వరకు ఆరుగురు నాయకుల్ని రాష్ట్ర స్థాయికి పరిచయం చేసింది. వీరిలో ప్రభుత్వ విప్‌గా, ప్రోటెమ్‌ స్పీకర్‌గా ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా సేవలు అందించిన వారు ఉన్నారు. ఈ సారి సైతం పాత, కొత్త వారిలో పలువురు ఎమ్మెల్యే టిక్కెట్ల సాధన కోసం పోరాడుతున్నారు.

  • ధన్వాడకు చెందిన చిట్టెం నర్సిరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్సీగా, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా(1985, 1989, 2004) సేవలు అందించారు. ఈయన మక్తల్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2004లో ప్రోటెమ్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. ఈయన రాజకీయ జీవితం ధన్వాడ సర్పంచి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత ధన్వాడ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. జనతాదళ్‌ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2005 ఆగస్టు 15న ప్రస్తుత జిల్లా కేంద్రమైన నారాయణపేటలో నక్సల్‌ దాడిలో దుర్మరణం చెందారు. ఈయన మృతితో ఖాళీ అయిన మక్తల్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పెద్ద కుమారుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం మక్తల్‌ నుంచి భారాస తరఫున ఈయనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
  • చిట్టెం నర్సిరెడ్డి కుమార్తెల్లో ఒకరైన డీకే అరుణ (ధన్వాడ ఆడపడచు) సైతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈమె గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడిన ప్రస్తుతం భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
  • ఉమ్మడి ధన్వాడ మండలంలోని పెద్ద చింతకుంట(ప్రస్తుతం మరికల్‌ మండలం) గ్రామానికి చెందిన ఎర్ర సత్యం జడ్చర్ల నియోజకవర్గం నుంచి 1994లో తెదేపా తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండేళ్లలోనే ఊహించని రీతిలో ఎర్రసత్యం హత్యకు గురికావడంతో ఆయన వారసుడిగా సోదరుడు ఎర్ర చంద్రశేఖర్‌ 1996లో జరిగిన జడ్చర్ల ఉప ఎన్నికల్లో తెదేపా తరఫున విజయం సాధించారు. ఎర్ర చంద్రశేఖర్‌ ఎమ్మెల్యేగా కాక ముందే ఉమ్మడి ధన్వాడ మండల పరిషత్తు అధ్యక్షుడిగా పని చేశారు. సహోదరుడు హత్యతో అధిష్ఠానం అదేశానుసారం ఎంపీపీ పదవిని అర్ధాంతరంగా వదులుకొని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈయన మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
  • అలాగే ఉమ్మడి ధన్వాడ మండలంలోని తీలేర్‌ గ్రామానికి చెందిన కె.వీరారెడ్డి అమరచింత నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ డీసీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆప్కాబ్ ఛైర్మన్‌గా సేవలు అందించారు.

ఈ ఆరుగురు నాయకులు రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉమ్మడి ధన్వాడ మండలానికి గుర్తింపు తీసుకొచ్చారు. ప్రస్తుతం వీరి వారసులు సైతం రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కృషి చేస్తున్నారు. చిట్టెం నర్సిరెడ్డి చిన్న కుమారుడైన చిట్టెం వెంకటేశ్వరరెడ్డి(ఈయన నక్సల్‌ దాడిలో మృతి చెందాడు) కూతురు పర్నికారెడ్డి పేట లేదా మక్తల్‌ నుంచి కాంగ్రెస్‌ టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. వీరారెడ్డి కుమారుడైన ప్రశాంత్‌కుమార్‌రెడ్డి మక్తల్‌ నుంచి రాజకీయ ప్రవేశం చేయాలని ప్రయత్నిస్తున్నారు.. చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మరో సారి మక్తల్‌ నుంచి భారాస తరపున అభ్యర్థిగా బరిలో దిగుతుండగా ఎర్ర చంద్రశేఖర్‌ సైతం మరో సారి జడ్చర్ల లేదా నారాయణపేట నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ తరఫున నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..అలాగే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపకల్పనలో సభ్యుడిగా ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి సైతం ఉమ్మడి ధన్వాడ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామ వాసియే కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని