logo

ప్రభుత్వ భూమిలో ప్లాట్ల దందా

రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి ప్లాట్లుగా మారుతోంది. మహబూబ్‌నగర్‌ - జడ్చర్ల రోడ్డులోని తిరుమల హిల్స్‌ కేంద్రంగా భారీ భూఆక్రమణ యథేచ్ఛగా సాగుతోంది.

Updated : 19 Mar 2024 06:20 IST

తిరుమల హిల్స్‌ కేంద్రంగా భారీ ఆక్రమణ
తహసీల్దార్‌ నివేదిక ఇచ్చినా చర్యలకు వెనకడుగు
న్యూస్‌టుడే, పాలమూరు పురపాలకం

సర్వే నంబర్‌ 372లోని గుట్టను తవ్వి వెంచర్‌కు రహదారి వేసి ఎవరూ చూడకుండా ఏర్పాటు చేసిన ఇనుప రేకుల ప్రహరీ..

రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి ప్లాట్లుగా మారుతోంది. మహబూబ్‌నగర్‌ - జడ్చర్ల రోడ్డులోని తిరుమల హిల్స్‌ కేంద్రంగా భారీ భూఆక్రమణ యథేచ్ఛగా సాగుతోంది. రాజకీయ అండ కలిగిన ఓ రియల్టర్‌ చాలాకాలంగా ఈ దందాకు పాల్పడుతున్నా అడిగే నాథుడు కరవయ్యారు. తిరుమల హిల్స్‌ కేంద్రంగా 372 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమి ఆక్రమించి వెంచర్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న రియల్టర్‌పై 2022 జులై 13వ తేదీనే అప్పటి మహబూబ్‌నగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌.. జిల్లా కలెక్టర్‌, ఆర్డీవోలకు నివేదిక ఇవ్వడంతో పాటు గ్రామీణ ఠాణా పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా ఆ రియల్టర్‌పై ఠాణాలో కేసు నమోదు కాకపోగా.. కలెక్టర్‌, ఆర్డీవో వైపు నుంచి కూడా ఎలాంటి చర్యలు ఆదేశాలు రాలేదు. రియల్టర్‌పై తహసీల్దార్‌ ఫిర్యాదు చేసిన పూర్తిస్థాయి నివేదిక ‘న్యూస్‌టుడే’ చేతికి చిక్కింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుమల హిల్స్‌ పరిసరాల్లో 372 సర్వే నంబర్‌లో ప్రభుత్వ రికార్డు ప్రకారం 23.08 ఎకరాల గైరాన్‌ భూమి ఉంది. ఈ భూమి గుట్టలతో కొంత, మెట్టగా కొంత విస్తరించి ఉంది. ఈ గైరాన్‌ భూమికి ఆనుకునే పట్టా భూములు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచే జడ్చర్లకు చెందిన ఓ బడా నేతకు అనుచరుడిగా, బినామీగా.. కొనసాగుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తి చాలా ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి వెంచర్లు చేసి విక్రయించడం ప్రారంభించాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తమ నేత అధికార పగ్గాలు చేపట్టడంతో పాటు మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని మరో ముఖ్యనేత అండతో ఈయన పూర్తిస్థాయి రియల్టర్‌గా మారిపోయాడు. తిరుమల హిల్స్‌ కేంద్రంగా రెండు చోట్ల పెద్ద వెంచర్లు ఏర్పాటు చేసి రూ.కోట్ల వ్యాపారానికి తెరలేపాడు. చుట్టూ ఉన్న కొండలు, గుట్టలు ధ్వంసం చేసి మట్టిని కూడా వెంచర్లలో రోడ్ల నిర్మాణానికి వాడి ప్రభుత్వానికి పెద్ద మొత్తంగా రాయల్టీ ఎగ్గొట్టాడు. మట్టి దందాపై అప్పట్లో ‘ఈనాడు’లో కథనాలు ప్రచురితమైనా మైనింగ్‌ అధికారుల్లో స్పందన కరవైంది. ఈ క్రమంలోనే ఎదిర శివారులో కొంత మంది రైతుల నుంచి పట్టా భూములు కొనుగోలు చేసిన ఈ రియల్టర్‌ పట్టా భూములకు ఆనుకుని ఉన్న 372 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. వెంచరు ఏర్పాటు చేస్తున్న క్రమంలో అవకాశం దొరికిన చోటల్లా గైరాన్‌ భూమిని పట్టా భూమిలో కలిపేసుకుంటూ ప్లాట్లు, రోడ్లు విస్తరిస్తూ వచ్చాడు. ఈ అక్రమ వ్యవహారంపై కొందరు అప్పటి తహసీల్దార్‌ పార్థసారథికి ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించి ఆర్‌ఐ, సర్వేయర్‌తో తిరుమల హిల్స్‌లోని 372 సర్వే నంబర్‌లోని గైరాన్‌ భూమిని సర్వే చేయించారు. నాలుగు చోట్ల రియల్టర్‌ సుమారు 3 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఆక్రమించినట్లు ఆర్‌ఐ, సర్వేయర్‌ నివేదిక అందజేశారు. రియల్టర్‌ ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో ఆక్రమించారో, ఆ భూమి పరిస్థితి ఏంటో నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. తహసీల్దార్‌ ఆ నివేదికను అప్పటి కలెక్టర్‌, ఆర్డీవోకు అందజేయడంతో పాటు మండల మెజిస్ట్రేట్‌ హోదాలో గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు ముఖ్య నేతల అండదండలు కలిగిన ఆ రియల్టర్‌పై చర్యలు తీసుకునేందుకు పోలీసులతో పాటు అధికారులు వెనకడుగు వేశారు. తాజాగా తిరుమల హిల్స్‌లో ఆ రియల్టర్‌ మరోమారు వెంచర్‌ను విస్తరిస్తూ సమీపంలోని ప్రభుత్వ భూమిలోని గుట్టను ధ్వంసం చేసి మట్టి తరలిస్తున్నాడు. మరోచోట గుట్ట తవ్వేసి తాను విస్తరిస్తున్న వెంచర్‌కు మరో వెంచర్‌లోని ప్రధాన రోడ్డుతో అనుసంధానం చేశాడు. ఇంకోచోట ప్రభుత్వ భూమి ఆక్రమించి రేకులషెడ్లతో నివాసాలు ఏర్పాటుచేశాడు. ఇంత జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరో చోట గైరాన్‌ భూమి ఆక్రమించి వేసిన గుడిసెలు

సర్వే చేయించి చర్యలు తీసుకుంటాం : ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదు. తహసీల్దార్‌ నివేదిక ఆధారంగా మరోమారు క్షేత్రస్థాయిలో మా అధికారులతో ప్రభుత్వ భూమిని సర్వే చేయిస్తాం. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైతే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం.

మోహన్‌రావు, అదనపు కలెక్టర్‌, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని