logo

మర పట్టలేదు.. లక్ష్యం చేరలేదు

కలెక్టరు కోయ శ్రీహర్ష ఇటీవల ధన్వాడ ప్రాంతంలో తనిఖీ నిర్వహించి సీఎంఆర్‌ బియ్యం ఇవ్వని మిల్లు యజమానిపై క్రిమినల్‌ కేసు పెట్టించారు. ఎన్నోసార్లు ఆయన సమీక్షలు నిర్వహించినా మిల్లర్లు కదలడం లేదు.

Published : 17 Apr 2024 05:31 IST

సీఎంఆర్‌పై మిల్లర్ల బేఖాతరు
న్యూస్‌టుడే, నారాయణపేట

కలెక్టరు కోయ శ్రీహర్ష ఇటీవల ధన్వాడ ప్రాంతంలో తనిఖీ నిర్వహించి సీఎంఆర్‌ బియ్యం ఇవ్వని మిల్లు యజమానిపై క్రిమినల్‌ కేసు పెట్టించారు. ఎన్నోసార్లు ఆయన సమీక్షలు నిర్వహించినా మిల్లర్లు కదలడం లేదు. మరిన్ని చర్యలకు ఉపక్రమించేలోగా సీఎంఆర్‌ లక్ష్యం పూర్తిచేయాలి. బియ్యం పక్కదారి పట్టకుండా చూసుకోవాలి.

త సంవత్సరం ఖరీఫ్‌, యాసంగి సీˆజన్లకు సంబంధించిన వరి ధాన్యం మర ఆడించడంలో మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అధికారుల అలసత్వం కారణంగా లక్ష్యం మేరకు ధాన్యం మర ఆడించలేకపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు గడువుల మీద గడువు విధిస్తున్నా మిల్లర్లు సకాలంలో బియ్యం ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు సీఎంఆర్‌ బకాయిలు చెల్లించని మిల్లర్లపై అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఖరీఫ్‌కు సంబంధించి కేవలం 17శాతం మాత్రమే పూర్తయ్యింది. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో బియ్యం అప్పగిస్తారో లేక బకాయి పడతారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.

జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి 38 మిల్లులకు 48,536 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించగా, 32,576 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 5,203 మెట్రిక్‌ టన్నుల బియ్యం అప్పగించారు. అదేవిధంగా 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించి మొత్తం 1.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుచేయగా ఆరు మిల్లులకు 50,229 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. 34,186 మెట్రిక్‌ టన్నులు బియ్యం రావల్సి ఉండగా ఇప్పటి వరకు 14,989 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. మరో 19,194 మెట్రిక్‌ టన్నులు అప్పగించాల్సి ఉంది. గడువులోగా బియ్యం అప్పగించకపోవడంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశంతో బియ్యం తీసుకోవడం నిలిపివేశారు. ఈ యేడాది యాసంగి సీˆజన్‌కుగాను 1.35లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా 105 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలుచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అంతంతగా వస్తుండటంతో పెద్దగా కొనుగోళ్లు జరుగడంలేదు. పంటలు కోతదశలో ఉండటంతో ఇప్పటి వరకు 81,200 మెట్రిక్‌ టన్నులు కొనుగోలుచేశారు. మరో పదిరోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగే అవకాశం ఉంది.
ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ధాన్యాన్ని జిల్లాలోని 38 మిల్లులకు, యాసంగి సీˆజన్‌  ఆరు మిల్లులకు కేటాయించారు. గడువులోగా సీఎంఆర్‌ ఇవ్వకపోతే చర్యలు తప్పవని కలెక్టరు హెచ్చరిస్తున్నారు.

చర్యలు చేపడతాం: జిల్లాలో ఖరీఫ్‌, యాసంగి సీజన్లకు సంబంధించి మిల్లర్లు పూర్తిస్థాయిలో సీఎంఆర్‌ బియ్యం అప్పగించలేదు. అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించి బియ్యం అప్పగించాలని మిల్లర్లకు చెప్పినా నేటికి పూర్తిస్థాయిలో అప్పగించలేదు. సాధ్యమైనంత త్వరగా బియ్యం అప్పగించాలని మిల్లర్లకు ఆదేశిస్తున్నాం. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.

దేవదాసు, పౌరసరఫరాలశాఖ డీఎం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని