logo

పరుగులో చిరుత

చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్‌, జాగింగ్‌ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్‌గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్‌ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్‌లో నిర్వహిస్తున్న జూనియర్‌

Published : 24 Apr 2024 06:15 IST

దుబాయ్‌ జూనియర్‌ ఏషియాడ్‌ పోటీలకు ఎంపికైన సాయిసంగీత
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ క్రీడలు

చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్‌, జాగింగ్‌ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్‌గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్‌ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్‌లో నిర్వహిస్తున్న జూనియర్‌ ఏషియాడ్‌ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు ఎంపికైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన దొడ్ల శ్యాంసుందర్‌, రాజేశ్వరి దంపతుల మొదటి సంతానం సాయి సంగీత. నాగర్‌కర్నూల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తండ్రి రాష్ట్రస్థాయి సీనియర్‌ అథ్లెట్‌. సాయి సంగీత చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి చూపటంతో ఆమెకు శిక్షణ ఇప్పించి ప్రోత్సహించారు. 2014లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటి హకీంపేటలోని క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందింది. 2014 నుంచి 2023 వరకు అక్కడే సాధన చేస్తూ ఇంటర్‌ చదివింది. ఆమె శారీరక సామర్థ్యాల ఆధారంగా హర్డిల్స్‌, ఆ తర్వాత 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగులో ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చారు. 2023-24 విద్యా సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని అల్వాస్‌ డిగ్రీ కళాశాలలో క్రీడా కోటా కింద సీటు సాధించింది. అక్కడే వసతి పొంది చదువుతూ అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఇప్పటివరకు 18 రాష్ట్రస్థాయి టోర్నీలతో పాటు 22 జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సొంతం చేసుకుంది.

సాధించిన విజయాలివే.. : 2017 ఆదిలాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌-14 అథ్లెటిక్స్‌ పోటీల్లో హర్డిల్స్‌ విభాగంలో పాల్గొని స్వర్ణ పతకం సాధించి అదే సంవత్సరం మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ స్థాయిలో సైతం కాంస్యం కైవశం చేసుకుంది. 2019 కర్ణాటక రాష్ట్రం ఉడిపిలో నిర్వహించిన సౌత్‌జోన్‌ పోటీల్లో 200 మీటర్ల పరుగులో స్వర్ణం దక్కించుకుంది. 2022 గుంటూరులో నిర్వహించిన సౌత్‌జోన్‌ జాతీయ స్థాయి పోటీల్లో 200 మీటర్ల పరుగులో రజతం అందుకుంది. 2022 మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన యూత్‌ నేషనల్స్‌ పోటీల్లో 200 మీటర్ల పరుగులో రజతం సొంతం చేసుకుంది. 2022 అసోం రాష్ట్రం గౌహతిలో నిర్వహించిన జూనియర్‌ నేషనల్స్‌ పోటీల్లో 100 మీటర్ల పరుగులో రజతం, 200 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. 2023 వరంగల్‌లో నిర్వహించిన సౌత్‌జోన్‌ పోటీల్లో 100 మీటర్లు, 200 మీటర్లు పరుగు విభాగాల్లో రజత పతకాలు కైవసం చేసుకుంది. 2023 తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో నిర్వహించిన జూనియర్‌ నేషనల్స్‌ పోటీల్లో 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించింది. 2024 ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లఖ్‌నవూలో నిర్వహించిన ఫెడరేషన్‌ కప్‌ పోటీల్లో 400 మీటర్ల పరుగులో, 200 మీటర్ల పరుగు విభాగాల్లో స్వర్ణ పతకాలు అందుకుని దుబాయ్‌లో జరిగే జూనియర్‌ ఏషియాడ్‌ టోర్నీకి ఎంపికైంది.

ఒలింపిక్స్‌కు ఎంపికే లక్ష్యం.. : అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు నాన్నతో పాటు హకీంపేట క్రీడా పాఠశాలలో శిక్షకులు ఆదిత్య, రతన్‌బోస్‌ ప్రోత్సాహం అందించారు. ప్రస్తుతం మంగళూరులో అజిత్‌ కుమార్‌ వద్ద శిక్షణ పొందుతున్నా. కొవిడ్‌ సమయంలో రెండేళ్ల పాటు ఇంటి వద్దే ఉండాల్సి రావటంతో చాలా ఇబ్బందిపడ్డా. సాధన లేక నిరుత్సాహానికి లోనయ్యా. కొవిడ్‌ అనంతరం సాధన చేసి గుంటూరు సౌత్‌జోన్‌ పోటీల్లో పాల్గొని రజతం సాధించాను. ఒలింపిక్స్‌కు ఎంపికవటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా.

సాయి సంగీత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు