logo

బరువు తగ్గిన జములమ్మ లడ్డూ

నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్‌దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు.

Updated : 24 Apr 2024 06:29 IST

50 గ్రాముల బరువున్న అమ్మవారి లడ్డూ

గద్వాల గ్రామీణం, న్యూస్‌టుడే: నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్‌దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏ మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం అమ్మవారి లడ్డూ 80గ్రాములు ఉండాల్సి ఉండగా.. ఒక్కో లడ్డూను కేవలం 50గ్రాముల బరువుతో తయారీ చేస్తూ భక్తుల తలపై లడ్డూ తయారీదారులు శఠగోపం పెడుతున్నారు. పైగా ఒక్కో లడ్డూ రూ.15ల చొప్పున జత లడ్లను రూ.30కు విక్రయిస్తున్నారు. లడ్డూలో జీడీపప్పు, కిస్‌మిస్‌, యాలకులు, కండచక్కెర లాంటి పదార్థాలు ఏ మాత్రం కనిపించడం లేదని.. కనీసం నెయ్యి వాడకం కూడా సక్రమంగా లడ్డూ తయారీలో వినియోగించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. లడ్లను తయారు చేసిన గంటల వ్యవధిలోనే చాలా గట్టిగా మారుతోందని.. రుచిలోనూ మార్పులు ఉన్నాయని భక్తులు వాపోతున్నారు. బూందిని ముద్దగా తయారు చేసే సమయంలో నీళ్లతో చేతులు తడుపుకుంటున్నారని.. నెయ్యితో చేతులు తడుపుకుని లడ్డూ ముద్దను తయారు చేస్తే ప్రసాదం గట్టిగా మారదని భక్తులు అంటున్నారు. ఆలయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లడ్డూ తయారీ సమయంలో తలకు టోపీలు, ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించాలన్న సూచనలు పాటించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులిహోర కూడా ఏమాత్రం రుచిగా లేదని భక్తులు వాపోతున్నారు. ఆలయం అధికారులు స్పందించి అమ్మవారి ప్రసాదాల నాణ్యతపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు