logo

హక్కు వినియోగం.. పరిఢవిల్లు ప్రజాస్వామ్యం

ఓటు... రాజ్యాంగం ప్రజలకు కల్పించిన వజ్రాయుధం. దీనిని వినియోగించి తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునేందుకు వీలుంటుంది. నచ్చకపోతే అదే ఓటుతో గద్దె దింపేందుకూ అవకాశం ఉంటుంది. ఓటు సద్వినియోగంతో మంచి నేతను ఎన్నుకోవడం ద్వారా పారదర్శక పాలనకు మార్గం సుగమం అవుతుంది.

Published : 25 Jan 2022 02:13 IST

యువత.. నమోదును విస్మరించొద్దు

జాతీయ ఓటరు దినోత్సవం నేడు
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

ఓటు... రాజ్యాంగం ప్రజలకు కల్పించిన వజ్రాయుధం. దీనిని వినియోగించి తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునేందుకు వీలుంటుంది. నచ్చకపోతే అదే ఓటుతో గద్దె దింపేందుకూ అవకాశం ఉంటుంది. ఓటు సద్వినియోగంతో మంచి నేతను ఎన్నుకోవడం ద్వారా పారదర్శక పాలనకు మార్గం సుగమం అవుతుంది. అందుకే అర్హులందరూ ఓటు హక్కును పొందాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం.

అవగాహన కార్యక్రమాలు
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటరు నమోదు, ఓటు హక్కు సద్వినియోగంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2011 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. 18ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావాలని సూచించటంతోపాటు ఓటు విలువపై ప్రచారం చేస్తున్నారు. ఓటరు నమోదు, ఓటు వినియోగంతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ప్రస్తుతానికి నిర్వహించడం లేదు.

ఈరోజే ఎందుకంటే..
18 ఏళ్లు నిండిన యువత ఓటరు నమోదుపై అంతగా ఆసక్తి చూపకపోవటాన్ని ఎన్నికల సంఘం గుర్తించింది. యువతను ఓటరు నమోదు దిశగా చైతన్యం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జనవరి 25న ఎన్నికల సంఘం 2011 నుంచి జాతీయ ఓటరు దినోత్సవంగా నిర్వహిస్తోంది.

ఎలా దరఖాస్తు చేయాలంటే..
* కొత్తగా ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపునకు ప్రత్యేక ఫారంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వీటికోసం బూత్‌స్థాయి అధికారిని సంప్రదించాలి.
* 2022 జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండుతున్న వారందరు రూ ఫారం-6లో దరఖాస్తు చేసుకోవాలి.
* జాబితాలో పేరు తొలగించాలన్నా, మృతిచెందిన వారి పేర్లు, నివాసం మారిన వారు, ఇతర అభ్యంతరాలున్న వారు ఫారం-7లో వివరాలు సమర్పించాలి.
* పేర్లు తప్పుగా నమోదయినా, మార్పులు, చేర్పులు చేయాలన్నా, ఓటరు పేరు, భర్త, తండ్రి పేరు సవరణకు ఫారం-8లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఒక నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు ఉండి నివాసం, పోలింగ్‌ కేంద్రం పరిధి మారినప్పుడు జాబితాలో నివాస ప్రాంతానికి మార్పు కోసం ఫారం-8(ఎ)ను నింపి అందజేయాలి.
అంతర్జాలంలోనూ అవకాశం..
వెబ్‌సైట్‌ల ద్వారా అంతర్జాలంలోకి ప్రవేశించాలి. అందులో ఫారం-6, 7, 8, 8ఎ స్టేటస్‌ అని వస్తాయి. కావాల్సిన దరఖాస్తు పత్రంపై నొక్కి వివరాలు నమోదు చేసుకోవచ్చు. చిరునామా, జన్మదిన తేదీ, కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబ బంధం, తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంతర్జాలంలో దరఖాస్తు చేయటమే కాకుండా దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వీలుంటుంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు