logo

ఉపాధికి చేయూత జాతీయ స్థాయి ఘనత

కరోనా పరిస్థితులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మ నిర్బర్‌ పథకం కింద రెండు సంవత్సరాలుగా రుణాలు అందిస్తోంది.

Published : 06 Jun 2023 01:08 IST

వీధి వ్యాపారులకు రుణాల పంపిణీలో ముందంజ
మొదటి పది స్థానాల్లో సంగారెడ్డి, జహీరాబాద్‌ పురపాలికలు

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జహీరాబాద్‌ : కరోనా పరిస్థితులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మ నిర్బర్‌ పథకం కింద రెండు సంవత్సరాలుగా రుణాలు అందిస్తోంది. సంగారెడ్డి, జహీరాబాద్‌ పురపాలికలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని దేశంలోనే తొలి పది స్థానాల్లో నిలిచాయి. వరుసగా మూడో సారి ఈ ఘనతను దక్కించుకున్నాయి. మొదటి విడత రూ.10 వేలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ రుణాన్ని సక్రమంగా చెల్లించిన వారికి రెండో విడత రూ.20 వేల రుణాన్ని వీధి వ్యాపారులకు ఇచ్చారు. వీటినీ చెల్లించిన వారికి రూ.50 వేల చొప్పున అందజేశారు. లక్షలోపు పట్టణ జనాభా కేటగిరీలో ఈ రెండు పురపాలికలు ఘనత సాధించాయి. ఇదే స్ఫూర్తితో మిగిలిన మున్సిపాలిటీలు ముందుకు సాగితే చిరు వ్యాపారులకు మరింత ఆర్థిక సహాయం అందుతుంది. ఈ నేపథ్యంలో కథనం.

కమిషనర్లు, మెప్మా విభాగం చొరవ

జిల్లాలో 8 పురపాలక సంఘాలున్నాయి. లక్షలోపు జనాభా విభాగంలో సంగారెడ్డి, జహీరాబాద్‌ మున్సిపాలిటీలు అత్యధిక రుణాలు ఇచ్చి ముందంజలో నిలిచాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి జహీరాబాద్‌లో 722 మందికి రూ.3.29 కోట్లు పంపిణీ చేయగా.. దేశంలో ఆరో స్థానం దక్కింది. సంగారెడ్డిలో 628 మందికి 2.15 కోట్లు రుణాలు అందించారు. ఈ పట్టణం జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండో విడత రుణాలు సక్రమంగా చెల్లించిన చిరు వ్యాపారులకు మూడో విడత రుణాలను పంపిణీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల పురపాలక కమిషనర్లతో పాటు మెప్మా విభాగంలో పని చేసే సీవోలు బ్యాంకర్ల వద్దకు వెళ్లి రుణాలు ఇప్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేశారు. వ్యాపారులు తీసుకున్న రుణాలు ప్రతి నెలా చెల్లిస్తున్నారా లేదా అని ఆరా తీస్తున్నారు. ఎవరైనా వెనుకడుగు వేస్తే.. అవగాహన కల్పించి చెల్లించేలా చూస్తున్నారు.

అందరి కృషితోనే గుర్తింపు: గీత, మెప్మా పీడీ

సంగారెడ్డి, జహీరాబాద్‌ పురపాలికలు అందరి కృషి ఫలితంగానే దేశంలోనే మొదటి పది స్థానాల్లో నిలిచాయి. ఈ గుర్తింపును ఇక ముందు కూడా కొనసాగించాలి. మిగతా పట్టణాల్లోనూ వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించి గుర్తింపు సాధించాలి.

తొలి రెండు విడతల్లో..

సంగారెడ్డి, జహీరాబాద్‌ మున్సిపాలిటీలు తొలి, రెండో విడత రుణాల విభాగంలోనూ జాతీయ స్థాయిలో టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నాయి. 2020-21 సంవత్సరానికి జహీరాబాద్‌ పురపాలికలో 3,633 మందికి రూ.3.63 కోట్లు పంపిణీ చేయగా ఆరో స్థానం, సంగారెడ్డిలో మొదటి విడత కింద రూ.10 వేల చొప్పున 3,387 మందికి రూ.3.38 కోట్లు ఇవ్వగా 9వ స్థానం సాధించాయి. 2021-22లో రెండో విడతలోనూ సంగారెడ్డిలో ఒక్కో వ్యాపారికి రూ.20 వేల చొప్పున 922 మందికి రూ.1.84 కోట్లు, జహీరాబాద్‌లో 779 మందికి రూ.1.55 కోట్ల రుణాలు అందిచాయి. సంగారెడ్డి 8, జహీరాబాద్‌ 10వ స్థానంలో నిలిచాయి. చిరు వ్యాపారులు చాలా మంది రుణాలు తీసుకున్న తరువాత నెల వారీ చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఈ రెండు పురపాలికల్లో మెప్మా సిబ్బంది ప్రత్యేక చొరవ చూపి.. వాయిదాలు సక్రమంగా చెల్లించేలా చొరవ చూపారు.

సంగారెడ్డిలో దుకాణాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని