logo

విపక్షమైనా వారే స్వపక్షమైనా వారే

రాజకీయాల్లో నాయకులు ఉన్నతంగా ఎదగడానికి అనేక మెట్లు. పైస్థాయి చేరడానికి, ప్రజల్లో అభిమానాన్ని చాటడానికి ఎన్నికలు దోహదమవుతాయి. ఓట్ల పండుగ వచ్చిందంటే బరిలో ఉండాల్సిందే. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ఎలాంటి ఎన్నికలైనా ఓట్ల వేటకు సిద్ధమవుతారు.

Updated : 26 Oct 2023 05:32 IST

కొన్ని నియోజకవర్గాల ఎన్నికల్లో కుటుంబాల ముద్ర

రాజకీయాల్లో నాయకులు ఉన్నతంగా ఎదగడానికి అనేక మెట్లు. పైస్థాయి చేరడానికి, ప్రజల్లో అభిమానాన్ని చాటడానికి ఎన్నికలు దోహదమవుతాయి. ఓట్ల పండుగ వచ్చిందంటే బరిలో ఉండాల్సిందే. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ఎలాంటి ఎన్నికలైనా ఓట్ల వేటకు సిద్ధమవుతారు. వారసత్వంగా వచ్చినా  తమదైన ముద్ర వేస్తూ.. పట్టు బిగిస్తూ.. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో కొన్ని కుటుంబాలున్నాయి. సర్పంచి స్థాయి నుంచి మంత్రి, ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్లిన నాయకులూ వారిలో ఉండటం విశేషం. ఎన్నికల్లో నిలుస్తున్న కుటుంబాలపై ప్రత్యేక కథనం.


నాడు మామ.. నేడు అల్లుడు

న్యూస్‌టుడే, సిద్దిపేట: సిద్దిపేట.. తెలంగాణ ఉద్యమానికి గరిమనాభి. ఈ ప్రాంతాన్ని ఏలిన వారు.. కీలక స్థానాల్లో రాణిస్తుండటం విశేషం. రాజకీయాల్లో చెరగని ముద్ర వేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తన్నీరు హరీశ్‌రావు మామాఅల్లుళ్లు. 2004 వరకు సిద్దిపేట శాసనసభ ఎమ్మెల్యేగా కేసీఆర్‌ కొనసాగారు. ముఖ్యమంత్రి స్వస్థలం సిద్దిపేట గ్రామీణ మండలం చింతమడక. తెలంగాణ ఆవిర్భావం నుంచి సీఎంగా కొనసాగుతున్నారు. అంతకుముందు ఆయన సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉపసభాపతిగా చేసిన అనుభవం ఉంది. 1985లో ఎమ్మెల్యేగా తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత మడమ తిప్పకుండా ముందుకు సాగారు. 2004 వరకు ఆరుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగుసార్లు తెదేపా, రెండుమార్లు భారాస నుంచి విజయ పతాకాన్ని ఎగురవేశారు. తద్వారా డబుల్‌ హ్యాట్రిక్‌కు నాంది పలికారు. 2004లో కేసీఆర్‌.. సిద్దిపేట శాసనసభ, కరీంనగర్‌ లోక్‌సభకు ఏకకాలంలో పోటీ చేసి రెండు చోట్లా విజయఢంకా మోగించారు.  సిద్దిపేట శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి, మేనల్లుడు తన్నీరు హరీశ్‌రావును నిలబెట్టారు. హరీశ్‌రావు ప్రజాప్రతినిధిగా తొలి అడుగు వేశారు. మేనమామ స్ఫూర్తితో తొలి ఉప ఎన్నిక ద్వారా గెలుపును ముద్దాడారు. ఇప్పటి వరకు రెండు హ్యాట్రిక్‌లను మంత్రి హరీశ్‌రావు సాధించారు. ప్రస్తుతం ఏడోసారి బరిలోకి దిగారు. రవాణా శాఖ మంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో హైదరాబాద్‌లో వారి వద్ద ఉంటూ హరీశ్‌ చదువు కొనసాగించారు. 2001లో తెరాస(భారాస) ఆవిర్భావం నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగారు. ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా ఎన్నికల్లో హరీశ్‌రావు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం జిల్లా పరిధిలో పక్కపక్కనే ఉన్న గజ్వేల్‌లో కేసీఆర్‌, సిద్దిపేటలో హరీశ్‌రావు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.


ఉపముఖ్యమంత్రిని ఇచ్చిన అందోలు

జోగిపేట, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా అందోలు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర రాజనర్సింహ తండ్రి సిలారపు రాజనర్సింహకు గట్టి పట్టు ఉండేది. 1967లో సిలారపు అందోలు (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వరుసగా 1967, 72, 78లో గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. లిడ్‌ క్యాప్‌ ఛైర్మన్‌గా, మంత్రిగా పని చేశారు. సిలారపు మరణానంతరం ఆయన వారసుడిగా 1989లో కుమారుడు దామోదర రాజనర్సింహ రాజకీయ అరంగేట్రం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. మార్కెటింగ్‌, ప్రాథమిక విద్యాశాఖల మంత్రిగానూ ఉమ్మడి ఆధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అందోలులో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.


హుస్నాబాద్‌: వొడితల ప్రాతినిధ్యం

హుస్నాబాద్‌: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ రాజకీయాలలో వొడితెల లక్ష్మీకాంతరావు కుటుంబం ప్రత్యేకతను చాటుకుంటోంది. పునర్విభజనకు ముందు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కెప్టెన్‌ కుటుంబం ప్రాతినిధ్యం వహించింది. పునర్విభజన తర్వాత నియోజకవర్గాల్లో మార్పులు చోటు చేసుకోవడంతో కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు హుస్నాబాద్‌ వైపు మొగ్గు చూపారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి తెరాస (భారాస) అభ్యర్థిగా పోటీ చేశారు. హుజూరాబాద్‌ మండలం సింగాపురానికి చెందిన లక్ష్మీకాంతరావు, రాజ్యసభ ఎంపీ వొడితెల రాజేశ్వర్‌రావు అన్నాదమ్ముళ్లు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు. 2014, 2018లో సతీశ్‌కుమార్‌.. హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈసారీ పోటీ చేస్తున్నారు. వీరి కుటుంబానికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు అనుబంధం ఉంది. పీవీ స్వగ్రామం హుస్నాబాద్‌లోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మంథని నుంచి పీవీ గతంలో శాసనసభకు ఎన్నికయ్యారు. హుస్నాబాద్‌కు ముందు ఉన్న ఇందుర్తి నియోజకవర్గంలో మూడుసార్లు శాసనసభకు ఎన్నికైన బొప్పరాజు లక్ష్మికాంతరావు.. పీవీకి వియ్యంకుడు.


పరిగి: నిలిస్తే ‘కొప్పుల’

పరిగి: వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గంలో ‘కొప్పుల’ వంశస్థులే ఎన్నికల్లో ప్రతిసారి నిలుస్తున్నారు. మొదట కొప్పుల హరీశ్వర్‌రెడ్డి.. 1978 నుంచి 1981 వరకు పరిగి సర్పంచిగా, 1985 వరకు సమితి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1985లో తొలిసారిగా తెలుగుదేశం నుంచి పరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 53,960 ఓట్లు సాధించి విజయదుందుభి మోగించారు. 1994లో మరింత ఎక్కువగా మొత్తం 67,433 ఓట్లు పొంది గెలిచారు. 1999, 2004, 2009లోనూ పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో తెదేపాకు రాజీనామా చేసి 2012లో తెరాస(భారాస)లో చేరారు. 2014లో మరోసారి ఓడిపోయారు. 2018లో ఆరోగ్యం సహకరించక పోవడంతో పెద్ద కుమారుడు మహేష్‌రెడ్డిని పోటీ చేయించారు. భారీగా 83,457 ఓట్లు వచ్చి గెలిచారు. ఈసారి భారాస తరఫున మహేష్‌ పోటీలో ఉన్నారు.


‘చిలుముల’ చుట్టూ నర్సాపూర్‌

నర్సాపూర్‌: మెదక్‌ జిల్లా రాజకీయాల్లో నర్సాపూర్‌ నియోజకవర్గానికో ప్రత్యేకత ఉంది. ఇక్కడి రాజకీయాల్లో మొదటి నుంచి చిలుముల వంశీయులే ఆధిక్యం చూపిస్తున్నారు. నర్సాపూర్‌లో 15 ఎన్నికలు జరగ్గా చిలుముల కుటుంబీకులే పోటీల్లో ఉంటున్నారు. కాంగ్రెస్‌కు ప్రధానంగా పోటీ ఇస్తోంది వీరి కుటుంబమే. 1957 మొదలుకుని 1999 ఎన్నికల వరకూ జరిగిన పది ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే చిలుముల విఠల్‌రెడ్డే ప్రధాన పోటీదారుగా నిలిచారు. 1999 నాటికి విఠల్‌రెడ్డి తమ్ముడి కుమారుడు మదన్‌రెడ్డి తెరపైకి వచ్చారు. 1999, 2004లో తెదేపా నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. విఠల్‌రెడ్డి సీపీఐ నుంచి చేసి పోటీ చేసి ఓడారు. 2009లో విఠల్‌రెడ్డి కుమారుడు కిషన్‌రెడ్డి మహాకూటమి నుంచి సీపీఐ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2014, 2018లో భారాస నుంచి పోటీ చేసిన మదన్‌రెడ్డి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి మదన్‌రెడ్డికి మెదక్‌ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. విఠల్‌రెడ్డి తమ్ముడు చిలుముల ఆశిరెడ్డి కౌడిపల్లి జడ్పీటీసీగా రెండుసార్లు గెలుపొంది ఉమ్మడి జిల్లా జడ్పీ ఉపాధ్యక్షులుగా రెండు దఫాలుగా పనిచేశారు. అంతకు ముందు ఆయన కౌడిపల్లి ఎంపీపీ ఉపాధ్యక్షులుగానూ చేశారు. తర్వాత ఆశిరెడ్డి కోడలు పద్మనర్సింహారెడ్డి కౌడిపల్లి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆశిరెడ్డి మరో కుమారుడు వెంకటేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం కౌడిపల్లి సర్పంచిగా కొనసాగుతున్నారు. కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా కొనసాగిన సమయంలో కిషన్‌రెడ్డి కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు. కిషన్‌రెడ్డి భార్య సుహాసినిరెడ్డి నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంట ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. ఈమె కుమారుడు శేషసాయిరెడ్డి చిలప్‌చెడ్‌ జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు.


నారాయణఖేడ్‌: మూడు కుటుంబాలే

నారాయణఖేడ్‌: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి 1952 నుంచి 2018 వరకు 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. అందులో 15 మార్లు మూడు కుటుంబాలకు చెందిన వారే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఈసారీ ఆ మూడు కుటుంబాల నుంచే అభ్యర్థులు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అవే శివరావు శెట్కార్‌, మహారెడ్డి వెంకట్రెడ్డి, పట్లోళ్ల కిష్టారెడ్డి కుటుంబాలు. అప్పారావు శెట్కార్‌ రెండు పర్యాయాలు, శివరావు శెట్కార్‌ మూడు.. వెంకట్రెడ్డి రెండు.. కిష్టారెడ్డి నాలుగు సార్లు గెలిచారు. శివరావు శెట్కార్‌ కుమారుడైన సురేష్‌ శెట్కార్‌ ఒక్కొక్కసారి ఎమ్మెల్యేగా, జహీరాబాదు ఎంపీగా ఎన్నికయ్యారు. వెంకట్రెడ్డి కుమారుడైన విజయపాల్‌రెడ్డి ఒకసారి శాసనసభ్యుడిగా గెలిచారు. మరో కుమారుడు భూపాల్‌రెడ్డి ఉప ఎన్నికలో మరోసారి సాధారణ ఎన్నికల్లో గెలిచారు. విజేతలైనా, ప్రత్యర్థులైనా అవే మూడు కుటుంబాలు. 2018లో భూపాల్‌రెడ్డి 58,508 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో సురేష్‌ శెట్కార్‌ కాంగ్రెస్‌ తరపున పోటీ చేశారు. కిష్టారెడ్డి కుమారుడైన సంజీవరెడ్డికి కాంగ్రెస్‌ టికెట్ రాకపోవడంతో భాజపా తరపున నిలిచారు. ఈసారి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని భారాస అభ్యర్థిగా ప్రకటించింది. విజయపాల్‌రెడ్డి భాజపా టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ను సురేష్‌ శెట్కార్‌, సంజీవరెడ్డి ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని