logo

కాంగ్రెస్‌ కార్యకర్తల్లో జోష్‌

సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పూజల హరికృష్ణ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మొదటిసారి బరిలో దిగుతున్న ఆయన స్వస్థలం సిద్దిపేట

Updated : 28 Oct 2023 04:41 IST

కాంగ్రెస్‌ కార్యకర్తల్లో జోష్‌ పెరిగింది. జిల్లాలో మిగిలిన నియోజక వర్గాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించడంతో ప్రచార జోరు ఊపందు కోనుంది.


యువ నాయకత్వం.. పూజల హరికృష్ణ

న్యూస్‌టుడే, సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పూజల హరికృష్ణ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మొదటిసారి బరిలో దిగుతున్న ఆయన స్వస్థలం సిద్దిపేట. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఎంఏ విద్య అభ్యసించారు. 1999 సంవత్సరంలో స్థానికంగా డిగ్రీ కళాశాల స్థాయిలో ఎన్‌ఎస్‌యూఐ ఉపాధ్యక్షుడిగా తన ప్రస్థానాన్ని మొదలెట్టారు. 2005-07 వరకు ఎన్‌ఎస్‌యూఐ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా, తదుపరి యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఏపీవైసీ (ఆంధ్రప్రదేశ్‌ యువజన కాంగ్రెస్‌) బూత్‌ కమిటీల రాష్ట్ర కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌ఛార్జిగా, కరీంనగర్‌ జిల్లా సహా వివిధ రాష్ట్రాల్లో యువజన కాంగ్రెస్‌ ఎన్నికల్లో అప్పగించిన బాధ్యతను నిర్వర్తించారు. 2010 సంవత్సరంలో ఏపీ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శిగా, 2011లో ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో వివిధ రకాల ఎన్నికల్లో భారత యువజన కాంగ్రెస్‌ తరఫున బాధ్యత చేపట్టారు. 2015-18 వరకు యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శిగా కొనసాగారు. టీపీసీసీ అధికార ప్రతినిధి సహా పలు హోదాల్లో పని చేశారు. వ్యాపారం నిర్వహించుకుంటూ పార్టీతో 25 ఏళ్లుగా అనుబంధం కొనసాగిస్తున్నారు. 2018 ఎన్నికల్లో తెజసతో పొత్తుల కారణంగా టికెట్‌ దక్కలేదు.


స్థానికం.. బీసీ నినాదం

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌: హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపికైన పొన్నం ప్రభాకర్‌ ఎన్‌ఎస్‌యూఐ నుంచి పార్టీలో వివిధ పదవులను చేపట్టారు. సహకార సంఘం అధ్యక్షుడుగా, మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా, కరీంనగర్‌ ఎంపీగా పదవులు నిర్వర్తించారు. న్యాయశాస్త్రం, పోస్టుగ్రాడ్యుయేట్‌ చదివిన ఈ బీసీ నాయకుడు కరీంనగర్‌లో కళాశాల స్థాయి నుంచి ఎన్‌ఎస్‌యూఐలో జిల్లా, రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా పనిచేశారు. 2009కు ముందు కరీంనగర్‌ డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా, మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా పని చేశారు. 2009లో కరీంనగర్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌గానూ వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినపుడు పెప్పర్‌ స్ప్రే దాడికి గురయ్యారు. 2018లో తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. ఈసారి హుస్నాబాద్‌ శాసనసభకు పోటీ చేస్తానని ప్రకటించి రెండు నెలల క్రితం ఆయన హుస్నాబాద్‌కు మకాం మార్చారు. ఓటరు జాబితాలో హుస్నాబాద్‌కు మార్చుకున్నారు. నియోజకవర్గంలో కల్లుగీత కార్మికులు కూడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు. గతంలో సీపీఐకి చెందిన దేశిని చిన్నమల్లయ్య  నాలుగుసార్లు గీత కార్మికుల మద్దతుతో విజయం సాధించారని, ఇది తనకు సహకరిస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం బీసీలకు ప్రాధాన్యం కల్పిస్తున్న నేపథ్యంలో ప్రభాకర్‌కు అభ్యర్థిత్వం ఖరారుకు దోహదమైంది.


ఉద్యోగం వదిలి.. ప్రజా క్షేత్రంలోకి..

చేర్యాల: జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపికైన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిది  మద్దూరు మండలం నర్సాయపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి.. 1999లో సచివాలయంలో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాలోకి ప్రవేశించారు. మొదట కాంగ్రెస్‌ పార్టీలో, అనంతరం భారాసలో చేరారు. ఉద్యమంలో పాల్గొన్నారు. 2003లో నర్మెట జడ్పీటీసీ సభ్యుడిగా భారాస నుంచి గెలిచారు. 2004లో భారాస అభ్యర్థిగా చేర్యాల నియోజకవర్గం  ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో రాజీనామా చేసి, తిరిగి ఉప ఎన్నికల్లోనూ గెలిచారు. 2011లో సస్పెన్షన్‌కు గురయ్యారు. అదే ఏడాది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరి తర్వాత గుడ్‌బై చెప్పారు. 2014లో భాజపాలో చేరి జనగామ బరిలో నిలిచారు. 2018లో మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. 2019లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఇటీవల జనగామ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని