logo

మత్తులో కారు నడిపి.. కుటుంబంలో విషాదాన్ని నింపి..

మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వ్యక్తి, ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతిచెందగా, వివాహం జరగాల్సిన యువతితోపాటు ఆరుగురికి గాయాలయ్యాయి.

Updated : 16 Apr 2024 06:24 IST

రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం, ఆరుగురికి గాయాలు

తూప్రాన్‌, చేగుంట: మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వ్యక్తి, ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతిచెందగా, వివాహం జరగాల్సిన యువతితోపాటు ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం తూప్రాన్‌ శివారులో జరిగింది. ఎస్సై శివానందం తెలిపిన ప్రకారం.. మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లికి చెందిన అంబర్‌పేట యాదగిరి, మంజుల దంపతుల కూతురి వివాహం ఈ నెల 24వ తేదీన జరగాల్సి ఉంది. ఈ సందర్భంగానే వస్త్రాల కొనుగోలుకు దంపతులతోపాటు, పెళ్లి జరగాల్సిన యువతి, యాదగిరి తమ్ముడు బాలకృష్ణ, రాధ దంపతులు వారి ఇద్దరు కుమారులు అఖిల్‌(15), అరవింద్‌తో కలిసి ట్రాలీ ఆటోలో తూప్రాన్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో 44వ జాతీయ రహదారిపై హల్దీవాగు వంతెన సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన కారు.. ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన అఖిల్‌పై నుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మరో ఆరు మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తి తూప్రాన్‌ పురపాలిక పరిధి పోతరాజ్‌పల్లికి చెందిన యస్కి నవీన్‌గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. మద్యం తాగి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

కుమారుడిని కోల్పోయి..: అఖిల్‌ చందాయిపేటలో ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఇటీవలే పరీక్షలు రాశాడు. తమ కళ్లముందే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ‘ఉన్నత చదువులు చదివి, ఇంటికి వెలుగు అవుతావని అనుకున్నాం బిడ్డా, ఇంతలోనే దేవుడు అన్యాయం చేశాడని’ శోకంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అరవింద్‌ గ్రామంలోనే ఆరో తరగతి చదువుతున్నాడు. గాయాలతోనే అన్న మృతదేహం వద్ద విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.


మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

సదాశివపేట: మనస్తాపంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం సదాశివపేట పట్టణంలో జరిగింది. సీఐ మహేష్‌గౌడ్‌ తెలిపిన ప్రకారం మండలానికి చెందిన ఓ కుటుంబం పట్టణంలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె (17)  బీఫార్మసీ చదువుతోంది. వివిధ కారణాలతో రెండు నెలలుగా మానసిక వేదనతో ఇంట్లోనే ఉంటోంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో పంకాకు ఊరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ‘నా మరణానికి ఎవరు కారణం కాదని ఉత్తరంలో పేర్కొందని సీఐ చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..

మూసాపేట, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై రామకృష్ణ తెలిపిన ప్రకారం..మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం సీతారాంనగర్‌ గ్రామానికి చెందిన లంగడి రమేష్‌(20) రెండేళ్ల క్రితం నగరానికి వలసొచ్చాడు. కూకట్‌పల్లి ప్రకాష్‌నగర్‌లోని అతని అన్న ప్రసాద్‌ ఇంటికి సమీపంలోని ఓ గదిలో ఒంటరిగా ఉంటున్నాడు. ‘డెలివరీ బాయ్‌’గా పనిచేస్తున్న అతడికి కొన్నాళ్లుగా ఆర్థిక సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా రమేష్‌ ఫోన్‌ ఎత్తకపోవడంతోపాటు కన్పించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు ఆదివారం రాత్రి అతడి గదికి వెళ్లి చూశారు. అప్పటికే అతడు గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయి కన్పించాడు. శనివారమే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.


అనుమానాస్పద స్థితిలో ఒకరు..

మెదక్‌, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మెదక్‌లో వెలుగు చూసింది. పట్టణ సీఐ దిలీప్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. మెదక్‌ మండలం శివాయిపల్లికి చెందిన కుర్తివాడ మల్లేశం(49) పని నిమిత్తం ఆదివారం మెదక్‌ పట్టణానికి వచ్చారు. సోమవారం ఉదయం స్థానిక బంగ్ల చెరువులో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్ద మృతుడి ద్విచక్ర వాహనం, చరవాణి లభించింది. తన భర్త మృతిపై అనుమానం ఉందని భార్య యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని