logo

జోరుగా ఉపాధి పనులు

జిల్లాలో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్‌ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు

Published : 17 Apr 2024 03:24 IST

నిత్యం 50 వేల మందికి పైగా హాజరు

ఎస్‌.కొండాపూర్‌లో..

మెదక్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్‌ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. ప్రతిరోజు సగటున 50 వేల మందికి పైగా హాజరవుతున్నారు. ఇటీవల భత్యాన్ని కేంద్రం మరింత పెంచింది. జిల్లా ఉన్నతాధికారులు గ్రామాల వారీగా లక్ష్యాన్ని విధించడంతో పనిచేసే వారి సంఖ్య పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి గ్రామపంచాయతీకి 150 మంది కూలీలు హాజరయ్యేలా లక్ష్యం విధించగా సగటున 116 మంది వస్తున్నారు.

 వలసలు నివారించేందుకు, ఉన్న ఊరిలో పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధిహమీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ పథకం ద్వారా 190 రకాల పనులను చేపట్టే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా 47 లక్షలు పూర్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. 2024-25లో 50 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 జలసంరక్షణకు ప్రాధాన్యం

జిల్లా వ్యాప్తంగా జల సంరక్షణకు అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఫీడర్‌ ఛానళ్ల ఏర్పాటు, చెరువులు, కుంటల్లో పూడిక తీయడం, పొలాలకు వచ్చే నీటి కాలువలను బాగు చేయడం వంటి పనులు చేపడుతున్నారు. దీంతో పాటు వ్యవసాయ పొలాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు.

భానుడి ప్రతాపంతో..

భానుడి ప్రతాపం కారణంగా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే పనులకు వెళ్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందజేస్తుస్తున్నారు. ప్రతి కూలీకి 2 లీటర్ల నీళ్లకు రూ.2.50 చెల్లిస్తున్నారు. ఇటీవలే కూలి రూ.272కు నుంచి రూ.300 వరకు పెంచడంతో ఈ నెల 1వ తేదీ నుంచి పనులకు కూలీల రాక జోరందుకుంది. సెలవుదినాల్లో కాస్త తగ్గుతోంది. ప్రస్తుతం సగటున రూ.210 అందుతోంది.


ప్రతి కూలీకి పని కల్పిస్తాం: శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

పనుల సీజన్‌ కావడంతో ప్రతి పంచాయతీలో నిత్యం 150 మంది కూలీలు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లెక్కన 70 వేలకు పైగా రావాలి. సగటున 50 వేలకు పైగా వస్తున్నారు. భత్యం పెంచడంతో ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో పనులు చేసే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని