logo

వడగండ్ల వానతో అతలాకుతలం

సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి.

Updated : 20 Apr 2024 05:53 IST

సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో కొట్టుకుపోగా మిగిలిన వడ్లు
సిద్దిపేట అర్బన్‌, దుబ్బాక, మిరుదొడ్డి, చేర్యాల, చిన్నకోడూరు, హుస్నాబాద్‌ గ్రామీణం, కోహెడ గ్రామీణం, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. రాఘవాపూర్‌, పుల్లూరు గ్రామాల్లో వడగండ్లు పడ్డాయి. ధాన్యం కుప్పలపై పరిచిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. రహదారులపై చెట్లు నేలకూలాయి. గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచింది.

  •  దుబ్బాక, హబ్షీపూర్‌, చేర్వాపూర్‌, చీకోడ్‌, చిట్టాపూర్‌, అప్పనపల్లి, చెల్లాపూర్‌, మల్లయ్యపల్లిలో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన, తూకం వేసిన ధాన్యం కుప్పలు, సంచులు తడిశాయి. కవర్లు కప్పి, వాన వరద కుప్పలపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా గాలివాన ఉద్ధృతికి చెల్లాచెదురయ్యాయి. నష్టం కలిగించింది. శుక్రవారం వరకు 79 మంది రైతుల 4 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని దుబ్బాక పీఏసీఎస్‌ సీఈవో మోహన్‌ తెలిపారు. మిరుదొడ్డి మండలంలో చిరుజల్లులు కురిశాయి. వాతావరణ చల్లబడింది. చిన్నకోడూరు మండలంలో పొద్దుతిరుగుడు గింజల బస్తాలు తడిశాయి.
  •  హుస్నాబాద్‌ మండలం జిల్లెలగడ్డ, మీర్జాపూర్‌, వంగరామయ్యపల్లి, భల్లునాయక్‌తండా, కేశవాపూర్‌, మల్లంపల్లి గ్రామాల్లో మొదట ఈదురు గాలులు మొదలయ్యాయి. తర్వాత వర్షం కురిసింది. జిల్లెలగడ్డలో పలువురి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. మామిడి కాయలు రాలి నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు.
  • కూరెళ్లలో రైతు బండారి మల్లయ్యకు చెందిన ఆవుపై మామిడి చెట్టు కూలి మృతి చెందింది. ఇదే గ్రామం కొండేటి కనకయ్యకు చెందిన మామిడి తోటలోని కాయలు నేలరాలాయి.

మబ్బును చూసి.. పచ్చి పంటను కోసి..

న్యూస్‌టుడే, చేర్యాల: గత నాలుగైదు రోజులుగా వరుణుడు దోబూచులాడుతున్నాడు. ఒకవైపు భానుడు భగభగ. మండే ఎండలు ఓవైపు.. ఆకాశంలో కారుమబ్బులు మరోవైపు కమ్ముతున్నాయి. దీంతో రైతుల గుండెల్లో గుబులు మొదలవుతోంది. అకాల వర్షాలతో మార్కెట్‌యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి ఆరబోసిన ధాన్యం తడిసిపోతుందన్న భయంలో రైతులు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికీ కోయకుండా ఉన్న చేను పొలంలోనే రాలిపోవడం, పైరుపైనే ధాన్యం మొలకెత్తుతుందని జంకుతున్నారు. మరో పాతిక రోజులు వర్షాలు లేకపోతే బాగుండు అన్నట్లుగా ఆకాశం కేసి రైతులు దయనీయంగా చూస్తున్నారు. ఈ నెల ఒకటినే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా తూకాలు మాత్రం ఆలస్యమయ్యాయి. ఆరబోయడానికి, రాత్రి కాపలా కాయడానికి రైతులు అవస్థ పడ్డారు. వాస్తవానికి పైరు పూర్తిగా పక్వానికి వచ్చాక నిమ్మపండు రంగులోకి మారి, ధాన్యం కంకులు కిందికి ఒంగినప్పుడు నూర్పిడి చేసుకోవాలి. కోత సమయానికి పది రోజుల ముందే నీటి తడులు ఆపేయాలి. మరో వారం రోజులు ఆగాల్సి ఉంటుంది. అకాల వానకు పంటంతా నష్టపోతామని భావించిన రైతులు బురద పొలంలోనే ఆకుపచ్చగా ఉన్న పైరును కోసేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు