logo

అవకాశాలు అందిపుచ్చుకోవాలని..

లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

Updated : 24 Apr 2024 07:38 IST

ఓటరు ప్రసన్నానికి విభిన్న మార్గాల్లో అభ్యర్థుల ప్రయత్నం

 న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌, జహీరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జహీరాబాద్‌ లోక్‌సభకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా బరిలోకి దిగుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా, భారాస ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. అందివచ్చిన అవకాశాలను అభ్యర్థులు ఉపయోగించుకుంటున్నారు.

 స్థానిక నాయకుల అనుమతితోనే..

 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడానికి లోక్‌సభ అభ్యర్థులు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆయా పార్టీల అసెంబ్లీ ఇన్‌ఛార్జులను కాదని ప్రచారం చేసుకునే వీలు లేకుండా పోయింది. అందుకే స్థానిక నాయకుల అనుమతులు ముందే తీసుకుంటున్నారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఉపాధిహామీ పనులు చేసే కూలీల వద్ద నుంచి అంగళ్ల వరకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

కుటుంబీకులు సైతం మేమంటూ..

భాజపా అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా ఆయన సోదరుడు ఎంబీ పాటిల్‌ ప్రచారం చేస్తున్నారు. జుక్కల్‌ నియోజకవర్గంలో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ఇక ఆయన కోడలు వచన పాటిల్‌ కూడా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌కు మద్దతుగా కుమార్తె గిరిజా షెట్కార్‌, కుమారుడు రాకేశ్‌ షెట్కార్‌ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులను కలిసి ప్రచార వ్యూహం రచిస్తున్నారు. సురేశ్‌ షెట్కార్‌ తమ్ముడు నగేశ్‌ షెట్కార్‌, ఆయన అన్న కుమారుడు సాగర్‌ షెట్కార్‌ కూడా ప్రచారంలో ఉన్నారు. భారాస అభ్యర్థి గాలి   అనిల్‌కుమార్‌ ప్రధానంగా పార్టీ నేతలపై ఆధారపడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీగా..

ప్రధాన పార్టీలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీలకు ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. మొత్తం లోక్‌సభ నియోజకవర్గం పేరిట కొన్ని గ్రూపులు, నియోజకవర్గాల వారీగా మరికొన్నింటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లలోనూ ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతున్నారు. నాయకుల సభలు, సమావేశాలను ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు సైతం కార్యకర్తలను ఉద్దేశించి సందేశాలు పంపుతున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని