logo

ముగ్గురు ఖరారు..!

కాంగ్రెస్‌ పార్టీ రెండో జాబితాలో ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

Updated : 28 Oct 2023 05:51 IST

మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి..
దేవరకొండలో బాలునాయక్‌..
భువనగిరిలో కుంభం
ఇంకా పెండింగ్‌లోనే సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ

ఈనాడు, నల్గొండ:  కాంగ్రెస్‌ పార్టీ రెండో జాబితాలో ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మునుగోడులో రెండు రోజుల క్రితం తిరిగి పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వగా.. దేవరకొండలో జడ్పీ మాజీ ఛైర్మన్‌, గత ఎన్నికల్లోనూ పార్టీ తరఫున పోటీ చేసిన బాలూనాయక్‌కు అవకాశం దక్కింది. భువనగిరిలో మూడు నెలల క్రితం భారాసలో చేరి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. తొలి జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజా ముగ్గురు అభ్యర్థులతో కలిపి మొత్తం తొమ్మిది స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది. సర్వేల ఆధారంగానే తాజా జాబితాను వెలువరించినట్లు స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడొకరు ‘ఈనాడు’కు వెల్లడించారు.  

మూడింటిపై ప్రతిష్టంభన...

సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ స్థానాలను ఇంకా పెండింగ్‌లో ఉంచారు. వీటిపై ఇప్పటికీ ప్రతిష్టంభన తొలగలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థానాల్లోని ఆశావహులతో స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు, ఏఐసీసీ పెద్దలు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. మిర్యాలగూడ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఎంకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్‌, సీపీఎం పార్టీ వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. తుంగతుర్తిలో గత రెండు ఎన్నికల్లో పోటీ చేసిన అద్దంకి దయాకర్‌, పిడమర్తి రవి, జ్ఞానసుందర్‌తో పాటూ శుక్రవారం పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సైతం టిక్కెట్‌ కోసం పోటీపడుతున్నారు. దీంతో దీనిని పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. సూర్యాపేటలో టిక్కెట్‌ ఆశిస్తున్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుల మధ్య తీవ్ర బేధాభిప్రాయాలు తలెత్తినట్లు తెలిసింది.టిక్కెట్‌ రానివారిని బుజ్జగించిన తర్వాతనే దీనిపై తుది ప్రకటన చేసే అవకాశముందని సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

ఆశావహుల దారెటు..!...

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అవకాశం దక్కడంతో ఇప్పటి వరకు ఇక్కడి నుంచి టిక్కెట్‌ తనదేనని ధీమాగా ఉన్న చల్లమల్ల కృష్ణారెడ్డి ఏం చేస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇక్కడి నుంచే గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పాల్వాయి స్రవంతి సైతం తన రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇవ్వాలని దిల్లీ పెద్దలను పట్టుబట్టినట్లు సమాచారం. దేవరకొండలోనూ టిక్కెట్‌ ఆశించిన రవినాయక్‌, కిషన్‌నాయక్‌, వడ్త్యా రమేశ్‌నాయక్‌ తదితరులు పార్టీ ప్రకటించిన అభ్యర్థికి ఏ మేరకు సహకారం అందిస్తారోనని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీసీ కోటాలో భువనగిరిని కేటాయిస్తామని గతంలో ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇక్కడి నుంచి టిక్కెట్‌ ఆశించిన బీసీ నేతలు పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతారోనని అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు.  


మునుగోడు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మద్దతుతో 2009లో తొలిసారి భువనగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన రాజగోపాల్‌రెడ్డి..2014 ఎన్నికల్లో భారాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2015లో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించి, 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలుపొందారు. అనంతరం భారాసకు ప్రత్యామ్నాయం భాజపా అని భావించి 2022 ఆగస్టులో ఆ పార్టీలో చేరి, అదే ఏడాది నవంబరులో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరి వరుసగా ఇక్కడి నుంచి రెండో దఫా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.  


దేవరకొండ : నేనావత్‌ బాలూనాయక్‌

తొలిసారి 2009లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలూనాయక్‌కు సీపీఐతో పొత్తుల్లో భాగంగా 2014లో టిక్కెట్‌ దక్కలేదు. దీంతో ఆయన్ను కాంగ్రెస్‌ జడ్పీ ఛైర్మన్‌ను చేసింది. అనంతరం 2015లో భారాసలో చేరిన బాలునాయక్‌ 2018 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లి ఆ పార్టీ నుంచే రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారాస అభ్యర్థి రవీంద్రకుమార్‌ చేతిలో ఓడిపోయారు. తాజాగా మరోసారి రవీంద్రకుమార్‌తోనే పోటీ పడుతున్నారు.  


భువనగిరి : కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

వరుసగా రెండోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. తొలిసారి 2018లో పోటీ చేసి భారాస అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విభేదాల కారణంగా  మూడు నెలల క్రితం భారాసలోకి వెళ్లి ఇటీవలే తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. గత కొన్నాళ్లు నుంచి ఇక్కడ పార్టీ తీసుకువచ్చిన బీసీ నినాదం, టిక్కెట్‌ ఆశించి రాని వారు ఎంత మేరకు సహకారం చేస్తారోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని