logo

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు

ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్లు సహృదయులు.. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ పోటీచేసినా అభ్యర్థులను అభిమానించి, ఆదరించి గెలిపిస్తున్నారు.

Updated : 04 Nov 2023 05:41 IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సహృదయత చాటిన ఓటర్లు

 

ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్లు సహృదయులు.. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ పోటీచేసినా అభ్యర్థులను అభిమానించి, ఆదరించి గెలిపిస్తున్నారు. ఎన్నికలు ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది స్థానికేతరులు విజయం సాధించి, ఆ నియోజకవర్గాలను అభివృద్ధి చేసి, అక్కడి ప్రజల అభిమానానికి పాత్రులయ్యారు. 

మోత్కూరు, న్యూస్‌టుడే

సూర్యాపేట నియోజకవర్గం

  • సూర్యాపేట నియోజవర్గం నుంచి కమ్యూనిస్టు నాయకుడు ఉప్పల మల్సూరు 1952, 1957లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా, 1962లో సీపీఐ, 1967లో సీపీఎం అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఈయనది మోతె మండలం సిరికొండ స్వస్థలం.
  • 1989, 1994 రెండుసార్లు తెదేపా నుంచి గెలుపొందిన ఆకారం సుదర్శన్‌ తుంగతుర్తి మండలం బండరామారానికి చెందిన వారు. ఈయన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. 1999లో పోటీచేసి ఓడిపోయారు.
  • 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డిది ఖమ్మం జిల్లా లింగాల స్వస్థలం.
  • గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్వస్థలం తుంగతుర్తి నియోజకవర్గం నాగారం. ఈయన 2014, 2018లో సూర్యాపేట నుంచి తెరాస అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.

నల్గొండ..

  • నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి 1962లో సీపీఐ అభ్యర్థిగా పోటీచేసిన బొమ్మగాని ధర్మభిక్షం స్వస్థలం సూర్యాపేట.
  • 1999, 2004, 2009, 2014లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి గెలుపొందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వస్థలం నకిరేకల్‌ నియోజకవర్గం నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల.
  • 2018లో తెరాస నుంచి పోటీచేసి గెలుపొందిన కంచర్ల భూపాల్‌రెడ్డిది నకిరేకల్‌ నియోజకవర్గం నార్కట్‌పల్లి మండలం ఉరుమడ్ల గ్రామం.

కోదాడ..

  • కోదాడ నియోజకవర్గం నుంచి 1999, 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వస్థలం తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామం. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఆయన హుజూర్‌నగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.
  • కోదాడ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి నలమాద పద్మావతి 2014లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు.

మిర్యాలగూడ..

  • మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి 1978, 1985లో సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన అరిబండి లక్ష్మీనారాయణ స్వస్థలం నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నె.
  • 1983లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి గెలిచిన చకిలం శ్రీనివాస్‌రావుది స్వస్థలం నల్గొండ.
  • 1994, 2004, 2009 సీపీఎం నుంచి పోటీచేసి గెలిచిన జూలకంటి రంగారెడ్డి స్వస్థలం తిప్పర్తి మండలం కొత్తగూడెం.
  • 2014లో కాంగ్రెస్‌ నుంచి, 2018లో తెరాస నుంచి పోటీచేసి గెలిచిన నల్లమోతు భాస్కర్‌రావు స్వస్థలం నిడమనూరు మండలం శాఖాపురం.

దేవరకొండ..

  • దేవరకొండ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన ధీరావత్‌ రాగ్యానాయక్‌ స్వస్థలం మిర్యాలగూడ నియోజకవర్గంలోని కొండపోలు. ఈయన సతీమణి భారతీరాగ్యానాయక్‌ 2002లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.
  • 1985, 1989, 1994 లో సీపీఐ నుంచి పోటీచేసి గెలుపొందిన బద్ధుచౌహన్‌ స్వస్థలం వరంగల్‌ జిల్లా. 1978, 1983లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన డి.రవీంద్రనాయక్‌ స్వస్థలం వరంగల్‌ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి. వీరు మంత్రిగా కూడా చేశారు.

నాగార్జునసాగర్‌..

  • నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో తెరాస అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన నోముల నర్సింహయ్య స్వస్థలం నకిరేకల్‌ మండలం పాలెం గ్రామం.
  • 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస నుంచి గెలుపొందిన నర్సింహాయ్య కుమారుడు నోముల భగత్‌ది అదే ఊరు.

భువనగిరి..

  • భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1962లో సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన అరుట్ల రాంచంద్రారెడ్డి స్వస్థలం ఆలేరు.
  • 1967, 1972లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి గెలిచిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్వస్థలం ఆసీఫాబాద్‌.
  • 2014, 2018లో తెరాస నుంచి పోటీచేసి గెలిచిన పైళ్ల శేఖర్‌రెడ్డి స్వస్థలం ఆలేరు నియోజకవర్గంలోని కదిరేణిగూడెం.

రద్దయిన రామన్నపేట నుంచి..

  • రద్దయిన రామన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి 1952, 1957, 1962లో గెలుపొందిన పీడీఎఫ్‌ అభ్యర్థి కట్కూరి రాంచంద్రారెడ్డిది సూర్యాపేట జిల్లా దాసిరెడ్డిగూడెం. ఇదే నియోజకవర్గం నుంచి 1967, 1972లో విజయం సాధించిన వడ్డేపల్లి కాశీరామ్‌ది, 1974లో గెలిచిన పెరికె రాజరత్నానిది నల్గొండ జిల్లా కేంద్రం.

ఆలేరు..

  • ఆలేరు అసెంబ్లీ స్థానం నుంచి 1972, 1978లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలిచిన అనిరెడ్డి పున్నారెడ్డిది తిరుమలగిరి మండలం ఈటూరు గ్రామం.
  • హుజూర్‌నగర్‌..
  • హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం 2009, 2014, 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వస్థలం తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తాటిపాముల.

నకిరేకల్‌..

  • నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన మూసపాటి కమలమ్మది హైదరాబాద్‌ స్వస్థలం.
  • 2014లో తెరాస నుంచి పోటీచేసి గెలిచిన వేముల వీరేశానిది తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండలం ఊట్కూరు స్వస్థలం. ఈయన 2018 తెరాస నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

తుంగతుర్తి..

  • తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1962లో నాగారం కేంద్రంగా ఉండేది. అప్పుడు అనిరెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈయనది పెన్‌పహాడ్‌ మండలం.
  • ఇదే నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లింగాల గ్రామం. 1999లో ఓటమి పాలైన ఆయన 1992, 2007లో మంత్రిగా పనిచేశారు.
  • 2009లో తెదేపా నుంచి పోటీచేసి గెలుపొందిన మోత్కుపల్లి నర్సిహులుది ఆలేరునియోజకవర్గంలోని రాజపేటమండల పారుపల్లి గ్రామం.
  • 2014, 2018లో తెరాస నుంచి పోటీచేసి గెలిచిన గాదరి కిశోర్‌కుమార్‌ది నల్గొండ స్వస్థలం.

మునుగోడు నియోజకవర్గం

  • మునుగోడు నియోజకవర్గం నుంచి 2004లో సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన పల్లా వెంకట్‌రెడ్డి స్వస్థలం దేవరకొండ మండలం పడ్మట్‌పల్లి.
  • 2009లో సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన ఉజ్జిని యాదగిరిరావు స్వస్థలం చింతపల్లి మండలం గడియగౌరారం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు