logo

నిత్యం రక్తసిక్తం..!

జాతీయ, ప్రధాన రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాహనాల అతివేగం, చోదకుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఒక్కరు చేసిన పాపానికి ఎందరో తనువు చాలిస్తున్నారు.

Published : 17 Apr 2024 06:28 IST

102 రోజుల్లో 91 మంది మృత్యువాత
ఈ నెలలో 16 మంది దుర్మరణం
ఈనాడు డిజిటల్‌, సూర్యాపేట, సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే

సూర్యాపేట పట్టణంలో ఈ నెల 11న జాతీయ రహదారి వంతెనపై డీసీఎంను వెనుక నుంచి ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన కారు

జాతీయ, ప్రధాన రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాహనాల అతివేగం, చోదకుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఒక్కరు చేసిన పాపానికి ఎందరో తనువు చాలిస్తున్నారు. తల్లిదండ్రులకు ఆసరా అవుతారనుకున్న కుమారులు దూరమై పుట్టెడు శోకాన్ని మిగులుస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో రోజూ ఎక్కడో చోట రహదారి ప్రమాదం జరుగుతూనే ఉంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి ఏప్రిల్‌ 11 వరకు 102 రోజుల వ్యవధిలోనే 91 మంది మృత్యువాత పడినట్లు పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సూర్యాపేట పురపాలిక పరిధిలో ఈ నెల 4 నుంచి 11 వరకు తొమ్మిది రోజుల వ్యవధిలో జరిగిన వేర్వేరుగా రోడ్డు ప్రమాదాల్లో 13 మంది దుర్మరణం చెందడం విస్మయం కలిగిస్తోంది. ప్రధానంగా వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం, అతివేగం వల్ల జరిగిన ప్రమాదాలే ఎక్కువ.

ఈ నెలలో జరిగిన  దుర్ఘటనలు ఇవీ..

  • ఈ నెల 3న కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం బస్టాండ్‌ సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఇస్తాళాపురం గ్రామానికి చెందిన మహిళ దుర్మరణం.
  • 4న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మానసనగర్‌ సమీపంలో కారు, ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృత్యువాత.
  • 5న సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
  • 7న చిలుకూరు మండలంలోని కవిత జూనియర్‌ కళాశాల సమీపంలో వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మరణం.
  • 8న సూర్యాపేట మండలం రాజునాయక్‌తండా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామానికి చెందిన యువకుడి దుర్మరణం.
  • 9న సూర్యాపేట నుంచి స్వగ్రామం పిల్లలమర్రి గ్రామం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో యువకుడి మృతి.
  • 9న ఆత్మకూర్‌ మండలం పాతర్లపహాడ్‌ గ్రామానికి చెందిన బాలుడు ట్రాక్టర్‌ నడుపుతూ అదుపుతప్పి మృతి.
  • 11న సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం.
  • 11న సూర్యాపేట పట్టణంలోని జాతీయ రహదారి వంతెనపైన డీసీఎంను వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

కఠిన చర్యలు
-రాహుల్‌ హెగ్డే, ఎస్పీ, సూర్యాపేట

వాహనదారులు నిబంధనలు పాటించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాహన తనిఖీలను విస్తృతం చేశాం. పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం, ఇష్టారీతిన రాకపోకలు సాగించడం మార్చుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని