logo

ఆవాసాలకు అమృతం కురిసింది

భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్‌ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.

Published : 18 Apr 2024 02:22 IST

పట్టణంలోని భారీ నీటి ట్యాంకు

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్‌ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది. నిధులు ఆరు నెలల క్రితం మంజూరైనప్పటికి సాంకేతిక కారణాలతో పనుల ప్రతిపాదనలకు, పనులు ప్రారంభం కాలేదు. మంజూరైన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటా, 20 శాతం రాష్ట్రం, 30 శాతం మున్సిపాలిటీ భరించాల్సి ఉంది. ప్రస్తుతం పట్టణంలోని 34 వార్డుల పరిధిలో ఏడు భారీ నీటి ట్యాంకుల ద్వార నల్లా నీటి సరఫరా జరుగుతోంది. మెట్రో వాటర్‌ వర్క్స్‌ నుంచి నిత్యం 5.5 ఎంఎల్‌డీల నీరు సరఫరా జరుగుతున్నప్పటికి నీటిని నిలువ చేసుకునేందుకు ప్రస్తుతం ట్యాంకులు లేకపోవడం గమనార్హం. దీంతో పైప్‌లైన్ల మరమ్మతులు, ఇతర సాంకేతికంగా సమస్య తలెత్తినప్పుడు నీటి సరఫరా నిలిచిపోతుంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నేటికీ నీటి సరఫరాకు పైప్‌లైన్‌ వ్యవస్థ పూర్తి స్థాయిలో లేకపోవడం గమనార్హం. మెట్రో నుంచి సరఫరా అవుతున్న నీటితో పాటు స్థానికంగా బోర్ల ద్వారా లభిస్తున్న నీటిని ఆవాస ప్రాంతాల్లోని మినీ నీటి ట్యాంకుల్లోకి ఎక్కించి సరఫరా చేస్తున్నారు. నిధుల మంజూరుతో పట్టణంలో నీటి సరఫరాకు మరిన్ని నిర్మాణాలు ఒనగూరే అవకాశం ఉంది.

ప్రతిపాదనలు ఇలా...

అమృత్‌ పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు పలు నిర్మాణాలను ప్రతిపాదించారు. పనుల టెండర్లను కేఎంఆర్‌ సంస్థ దక్కించుకుంది. టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటికి ఎన్నికల కోడ్‌ కారణంగా పనులు ప్రారంభం కాలేదు. కోడ్‌ ముగియగానే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో పగిడిపల్లి, రాయగిరి, బొమ్మాయిపల్లి గ్రామ పంచాయతీల విలీనంతో పట్టణ పరిధి పెరిగింది. ఆయా గ్రామాల్లోని ఆవాస ప్రాంతాల్లో అప్పటి అవసరాల మేరకు నీటి ట్యాంకులు, పైప్‌లైన్లు నిర్మించారు. ప్రస్తుతం ఆయా పంచాయతీల పరిధిలో ఆవాస ప్రాంతాలు పెరిగాయి. నీటి డిమాండ్‌ పెరిగింది. పట్టణంతో పాటు విలీన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు నిర్మాణపు పనులు ప్రతిపాదించారు. అమృత్‌ పథకం కింద పట్టణంలో 1.5 ఎంఎల్‌డీ, 1 ఎంఎల్‌డీ, 300 కేఎల్‌ మూడు ట్యాంకుల నిర్మాణాలను ప్రతిపాదించారు. ఆయా ట్యాంకులకు, ఆవాస ప్రాంతాలకు అనుసంధానించేందుకు ఆరు కిలోమీటర్ల పొడవు ఫీడర్‌ పైప్‌లైన్‌, మూడు కిలో మీటర్ల పొడవు డిస్ట్రిబ్యూషన్‌ పైప్‌లైన్‌ నిర్మాణాలను ప్రతిపాదించారు. ఈ విషయమై ఇన్‌ఛార్జి డీఈ కొండల్‌రావును వివరణ కోరగా ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని