logo

పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!

అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి.

Updated : 18 Apr 2024 05:42 IST

తల్లిదండ్రులతో ధీరజ్‌రెడ్డి

గుర్రంపోడు, న్యూస్‌టుడే: అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. అలాంటి లక్ష్యాన్ని నిర్ధేశించుకుని, అన్ని కష్టాలకు ఓర్చి యూపీఎస్‌సీ ఫలితాల్లో ర్యాంకు సాధించారు పెంకీసు ధీరజ్‌. నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్‌ మండలం అల్వాల గ్రామానికి చెందిన ధీరజ్‌ పెంకీసు సత్యనారాయణరెడ్డి, హేమలత దంపతుల కుమారుడు. బ్యాచిలర్‌ డిగ్రీని మధ్యలో ఆపేసి దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశారు. మూడుసార్లు విఫలమైనా పట్టువదలకుండా నాలుగోసారి యూపీఎస్‌సీ పరీక్షలకు గట్టిగా ప్రయత్నించి 173వ ర్యాంకు సాధించి పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. మెరుగైన సమాజం కోసం సేవలందిస్తానని చెబుతున్న ధీరజ్‌ తనకు ఐపీఎస్‌ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

  • ధీరజ్‌రెడ్డి పదోతరగతి వరకు అల్వాలలో చదివి అనంతరం ఇంటర్మీడియట్‌కు హైదరాబాద్‌ వెళ్లారు. తండ్రి సత్యనారాయణరెడ్డి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా, తల్లి హేమలత ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. ధీరజ్‌రెడ్డి డిగ్రీ చదువుతున్న సమయంలో ఒకసారి తండ్రి పనిచేసే కళాశాలకు వెళ్లిన సందర్భంలో అక్కడి పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూసి ఇలాంటి విద్యార్థుల సమస్యలు తీర్చగలిగే స్థాయి అధికారిగా అవ్వాలనుకున్నారు. అదే స్ఫూర్తితో సివిల్స్‌ రాయాలనుకున్నారు. అందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించటంతో ఐదేళ్లూ అదే లక్ష్యంతో చదివి విజయం సాధించగలిగారు.

 

  • 2019 నుంచి 2024 వరకు అదే లక్ష్యంతో నిరంతర శ్రమతోనే నాలుగో ప్రయత్నంలో విజయం సాధించానని ధీరజ్‌ అంటున్నారు. స్కోరింగ్‌ పేపర్స్‌ మీద ఎక్కువ రివిజన్‌ చేశానని. తక్కువ సమయంలో అయిపోయేలా షార్ట్‌ నోట్స్‌ ఎక్కువగా రాసుకుని చదివేవాడినని ధీరజ్‌ వెల్లడించారు. ఇంటర్వ్యూలో డిఫెన్స్‌ వంటి అంశాల్లో కఠినమైనవి అడుగుతారనుకున్నానని, కాని తన అలవాట్ల గురించి, ఇంగ్లిష్‌ మీద, మైథాలజీ అంశాలపై ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఒకటి రెండు సార్లు విఫలమైనా విజయం సాధించేవరకూ పట్టువదలకూడదని సూచించారు. ఐదేళ్ల కాలంలో ఫంక్షన్లు వగైరా బంద్‌ చేసి నిత్యం సాధన చేశాడని తండ్రి సత్యనారాయణరెడ్డి చెప్పారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని