logo

బరిలో.. తొలిసారి

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో  ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా..

Updated : 18 Apr 2024 05:46 IST

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో  ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. వారు ప్రచారం సైతం ప్రారంభించారు. రెండు నియోజకవర్గాలకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా, భారాస నుంచి బరిలో నిలుస్తున్న ఆరుగురు అభ్యర్థుల్లో ఐదుగురు లోక్‌సభ బరిలో నిలవడం తొలిసారి కావడం విశేషం. భువనగిరి నుంచి భాజపా తరఫున బరిలో నిలుస్తున్న బూర నర్సయ్యగౌడ్‌ గతంలో ఒక సారి ఎంపీగా విజయం సాధించి.. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

కుందూరు రఘువీర్‌రెడ్డి..

నల్గొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున కుందూరు రఘువీర్‌రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తనయుడైన రఘువీర్‌.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి బరిలో నిలిచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పలు సర్వేల నివేదికల నేపథ్యంలో అధిష్ఠానం రఘువీర్‌కు లోక్‌సభ సీటు హామీ ఇవ్వడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, లోక్‌సభ పరిధిలో ఇద్దరు మంత్రులు సహా నలుగురు ఎమ్మెల్యేలు ఉండడం తన గెలుపునకు దోహదం చేస్తాయని ధీమాగా ఉన్నారు.

కంచర్ల కృష్ణారెడ్డి..

నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడైన కృష్ణారెడ్డి.. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి లోక్‌సభ బరిలో భారాస తరఫున నల్గొండ నుంచి పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో కేసీఆర్‌, కేటీఆర్‌ పర్యటనలు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విస్తృత పర్యటనలతో పాటు గతంలో పార్టీ క్యాడర్‌ బలంగా ఉండడం తన విజయానికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

శానంపూడి సైదిరెడ్డి..

శానంపూడి సైదిరెడ్డి రాజకీయాలకు కొత్త కాకపోయినా.. లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి తలపడబోతున్నారు. గతంలో భారాస తరఫున హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఇటీవలే భాజపా తీర్థం పుచ్చుకున్నారు. వెంటనే భాజపా అధిష్ఠానం ఆయనను నల్గొండ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో తమకు విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

చామల కిరణ్‌కుమార్‌రెడ్డి..

చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో పలు ఉన్నత పదవుల్లో పని చేసినప్పటికీ చట్టసభకు పోటీ పడడం ఇదే తొలిసారి. భువనగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న ఆయన.. నియోజకవర్గంలో అత్యధిక మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం, రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు ప్రస్తుతం పార్టీ క్యాడర్‌ బలంగా ఉండడం తనకు కలిసొస్తుందని భావిస్తున్నారు.

క్యామ మల్లేష్‌..

భువనగిరి నుంచి భారాస తరఫున బరిలో నిలుస్తున్న క్యామ మల్లేష్‌ తొలిసారి లోక్‌సభ బరిలో నిలుస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ తరఫున ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో భారాసలో చేరారు. బీసీ నినాదం కింద భారాస తమ అభ్యర్థిగా మల్లేష్‌ను బరిలో నిలిపింది. లోక్‌సభ పరిధిలో అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నంలో తనకున్న పరిచయాలు, నియోజకవర్గంలో గతంలో భారాస బలంగా ఉండడం తనకు కలిసొస్తుందని ధీమాగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని